తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికలు సమీపంలో ఉన్న తరుణంలో మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణపై జోరుగా వార్తలు వస్తున్నాయి. త్వరలోనే మంత్రి వర్గ పునర్‌వ్యవస్థీకరణ చేపట్టే అవకాశాలున్నాయని, కొంద‌రు మంత్రుల‌కు ఉద్వాస‌న ఖాయ‌మంటున్నారు. దానిలో భాగంగా మేడ్చల్‌ నియోజకవర్గ మంత్రి చామకూర మల్లారెడ్డికి సీఎం కేసీఆర్‌ ఉద్వాసన పలుకనున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే, ఈ ట్విస్టును ఎదుర్కునేందుకు మంత్రి మ‌ల్లారెడ్డి షార్ట్‌క‌ట్ క‌నిపెట్టార‌ని చెప్తున్నారు. అదే ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడు, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ను ప్ర‌శంసించండం.

 

గులాబీ ద‌ళ‌ప‌తి, తెలంగాణ సీఎం కే  చంద్రశేఖర్‌ రావు మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణపై దృష్టి సారించారని ప్ర‌చారం జ‌రుగుతోంది.   రెండోసారి అధికారంలోకి వచ్చాక ఎవరూ ఊహించని విధంగా మల్లారెడ్డిని తన కేబినెట్‌లోకి తీసుకున్న చంద్రశేఖర్‌ రావు, ఆయనకు కార్మిక, ఉపాధి కల్పన, మహిళా, శిశుసంక్షేమ శాఖను అప్పగించారు. అంతేకాకుండా, ఈ ఏడాది జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కూడా చంద్రశేఖర్‌ రావు, మల్లారెడ్డి అల్లుడికి మల్కాజ్‌గిరి ఎంపీ టికెట్‌ కేటాయించారు. రేవంత్‌రెడ్డిని ఓడించేందుకు చంద్రశేఖర్‌రావు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సీటు ఇచ్చినా అక్కడ టీఆర్‌ఎస్‌ ఓడిపోవడం కూడా చంద్రశేఖర్‌ రావు అసంతృప్తికి కారణంగా చర్చ జరుగుతోంది. దీంతోపాటుగా అయితే శాఖాపరంగా ఆయన పనితీరు సంతృప్తికరంగా లేకపోవడంతో మల్లారెడ్డిని మంత్రి పదవి నుంచి తొలగించాలని చంద్రశేఖర్‌ రావు భావిస్తున్నట్లు సమాచారం.

 

అయితే, ఈ ప‌రిణామానికి మంత్రి మ‌ల్లారెడ్డి చెక్ పెట్టార‌ని అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక‌విధాన‌మైన‌ TS-ఐపాస్ ప్ర‌వేశ‌పెట్టి 5 సంవత్సరాలు పూర్త‌యిన‌ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన మల్లారెడ్డి.. ఇందుకు కృషి చేసిన మంత్రి కేటీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రమంలోనే కేటీఆర్‌పై మల్లారెడ్డి ప్రశంసలు గుప్పించారు. మంత్రి కేటీఆర్ యంగ్ అండ్ డైనమిక్ మినిస్టర్ అని ఆయనను యువత ఆదర్శంగా తీసుకోవాలంటూ చెప్పుకొచ్చారు. దేశంలో గొప్ప ఐటీ మినిస్ట‌ర్ అని ప్రశంసించారు. కాగా, మంత్రి మ‌ల్లారెడ్డి ప్ర‌శంస‌ల‌తో కేటీఆర్ సైతం న‌వ్వు ఆపుకోలేక‌పోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: