రాజధాని అమరావతి నిర్మాణంపై రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసిన  చంద్రబాబాబునాయుడుకు రెండు పార్టీలు షాక్ ఇచ్చాయి. చంద్రబాబు అధ్యక్షతన ఏర్పాటు చేస్తున్న రౌండ్ టేబుల్ సమావేశంలో తాను పాల్గొనేది లేదని బిజెపి, సిపిఎం పార్టీలు తెగేసి చెప్పాయి.  చంద్రబాబును నమ్మి మోసపోయే స్ధితిలో తాము లేమని రెండు పార్టీల నేతలు టిడిపికి స్పష్టంగా చెప్పినట్లు సమాచారం.

 

అధికారంలో ఉన్న ఐదేళ్ళూ రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి చంద్రబాబబు తనిష్టారాజ్యంగా వ్యవహరించిన విషయం అందరికీ తెలిసిందే. రాజధాని నిర్మాణంలో ఏ పార్టీకి చివరకు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసిపికి కూడా ఎటువంటి పాత్ర లేకుండానే వ్యవహారాలు నడిపారు. చివరకు మిత్రపక్షంగా మూడున్నరేళ్ళున్న బిజెపిని కూడా దూరంగా పెట్టేశారు.

 

రాజధానికి చేసిన భూమిపూజలో ప్రతిపక్షాలను చివరి నిముషంలో పిలిచేవారు.  ప్రధానమంత్రి నరేంద్రమోడితో చేయించిన  శంకుస్ధాపన కార్యక్రమానికి కూడా ప్రతిపక్షాలను మొక్కుబడిగానే పిలిచారు. ఈ విషయమై అప్పట్లోనే అన్నీ పార్టీల నుండి నిరసన వ్యక్తమైనా లెక్క చేయలేదు. ఇక రాజధాని నిర్మాణం ముసుగులో పాల్పడిన అరాచకాలు, చేసిన అవినీతికి అంతే లేదు.

 

చంద్రబాబు పరిపాలనతో విసిగిపోయిన జనాలు గూబగుయ్యిమనిపించారు. చివరకు రాజధాని ప్రాంతంలో తాను చాలా అభివృద్ధి చేశానని చెప్పుకుంటున్న చంద్రబాబు తాడికొండ, మంగళగిరి నియోజకవర్గాల్లో టిడిపి ఓటమికి సమాధానం చెప్పలేకపోతున్నారు. ఇపుడు ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశం కూడా బిజెపితో దగ్గరయ్యేందుకు ఏర్పాటు చేసిందే అనే ప్రచారం జరుగుతోంది.

 

జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న బిజెపి, సిపిఎంలు సమావేశానికి రావటం లేదని స్పష్టంగా చెప్పేశాయి. జనసేన నేతలు హాజరవుతారని అనుకుంటున్నారు. జనసేన అంటే చంద్రబాబు జేబులో పార్టీగా ప్రచారంలో ఉంది కాబట్టి ఎవరు పట్టించుకోవటం లేదు. మిగిలింది సిపిఐ మాత్రమే. మరి ఆ పార్టీ ఏమి చేస్తుందో చూడాలి. మేధావులు, ప్రజాసంఘాల నుండి ఎవరు హాజరవుతారో తెలీదు. మొత్తం మీద రౌండ్ టేబుల్ సమావేశం సందర్భంగా రెండు పార్టీలు ముందే షాక్ ఇచ్చినట్లు అర్ధమవుతోంది.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: