దిశ హత్య కేసు విచారణలో సిట్ ఏర్పాటైంది. శంషాబాద్ డీసీపీ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం దిశ కిడ్నాప్, అత్యాచారం, హత్యలకు సంబంధించిన కేసులను విచారించనుంది. నలుగురు అదనపు ఎస్పీ స్థాయి అధికారులు ఈ టీంలో ఉన్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్ నుండి నివేదికలు తెప్పించటం, ఆధారాల సేకరణపై ఈ టీం దృష్టి పెట్టనుంది. దిశ కేసులో దర్యాప్తు వేగవంతం చేసేందుకు సైబరాబాద్ సీపీ సజ్జనార్ సిట్ బృందాన్ని ఏర్పాటు చేశారని సమాచారం. 
 
ప్రభుత్వ సూచనల మేరకు సిట్ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో నలుగురు అదనపు ఎస్పీలతో సిట్ బృందంగా ఏర్పడింది. విచారించటం, ఆధారాల సేకరణ, శాస్త్రీయపరమైన ఆధారాల సేకరణ, ల్యాబ్ నివేదికల కోసం నాలుగు బృందాలుగా ఏర్పడిన సిట్ అధికారులు దిశ ఘటనకు సంబంధించిన పూర్తి స్థాయి ఆధారాలను సేకరిస్తారు. 
 
పోలీసులు నిందితులను ఇప్పటికే కస్టడీలోకి తీసుకున్నారు. పోలీసులు విచారణ విషయాలను మాత్రం గోప్యంగా ఉంచుతున్నట్లు తెలుస్తోంది. పక్కా ప్రణాళికతోనే దిశ అత్యాచారం, హత్య జరిగిందని ఘటన రీ కన్ స్ట్రక్షన్ లో పోలీసులు గుర్తించారు. ప్రత్యేక కోర్టు ఏర్పాటుతో నిందితులకు కఠిన శిక్ష పడే విధంగా ఆధారాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. 
 
చర్లపల్లి జైలు దగ్గర ఎటువంటి ఆందోళనలు జరగకుండా పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. 12 మంది అధికారులతో ఏర్పాటైన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ లో నలుగురు అడిషనల్ డీసీపీలు, ముగ్గురు సీఐలను, ఇద్దరు ఎస్సైలను నియమించారు. కస్టడీ పూర్తైన మరుక్షణమే ఫాస్ట్ ట్రాక్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ లను కలెక్ట్ చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో నిందితులకు కఠిన శిక్షలు విధించాలని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. 

 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: