గత కొన్ని రోజులుగా రాజధాని అమరావతిపై పెద్ద ఎత్తున రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. రాజధాని విషయంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య మాటల యుద్ధం పెరుగుతూ వస్తుంది. చంద్రబాబు ఐదేళ్లు రాజధానిలో గ్రాఫిక్స్ చేసి ప్రజలని మోసం చేశారంటే, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం రాజధానిని గాలికొదిలేసిందని టీడీపీ అంటుంది. ఈ క్రమంలోనే ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతిలో పర్యటించారు. పర్యటనలో భాగంగా కొందరు రైతులు బాబు కాన్వాయ్ పైసి చెప్పులు, రాళ్ళు వేయడంతో అమరావతి హీట్ మరింత పెరిగింది.

 

ఈ నేపథ్యంలోనే రాజధాని విషయంలో వైసీపీ తీరుని ఎండగట్టడానికి టీడీపీ అఖిలపక్ష సమావేశానికి సిద్ధమైంది. ఈ సమావేశంలో రాజధానిపై సీఎం జగన్ నోరు విప్పడం లేదని విమర్శించే అవకాశం ఉంది. అలాగే 29 గ్రామల భూములు తీసుకొని, నిధులు వెచ్చించి జరిగిన నిర్మాణాలపై వివరణ ఇవ్వనున్నారు. అలాగే మంత్రులు రాజధాని మార్పుపై పూటకో మాట మాట్లాడి ప్రజల్లో అభద్రతాభావం కలిగిస్తున్నారని వైసీపీ ప్రభుత్వం టార్గెట్ గా విమర్శలు చేసే అవకాశముంది.

 

కాగా, గురువారం విజయవాడలో ఈ సమావేశం జరగనుంది. అయితే ఈ సమావేశానికి వైసీపీకు తప్ప మిగతా అన్నీ పార్టీలకు టీడీపీ ఆహ్వానం పంపింది. అలాగే నిపుణులు, మేధావులు, వివిధ సంఘాలను కూడా ఆహ్వానించింది. అయితే సమావేశానికి బీజేపీ, సీపీఎం పార్టీలు హ్యాండ్ ఇచ్చాయి. చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరు కాబోమని బీజేపీ, సీపీఎంలు తేల్చి చెప్పాయి.

 

అయితే గతంలో చంద్రబాబుని నమ్మి మోసపోయామని, మరొక్కసారి ఆ తప్పు చేయమని బీజేపీ చెబుతుంది. బాబుతో క‌ల‌వం అని పార్టీ క్లీయ‌ర్‌గా తేల్చి చెప్పేసింది. తమతో కలవడానికే పరోక్షంగా ఈ సమావేశం ఏర్పాటు చేశారని బీజేపీ ఆరోపిస్తుంది. ఇదిలా ఉంటే టీడీపీ రౌండ్ టేబుల్ సదస్సుకు ధీటుగా వైసీపీ రాజధాని ప్రాంత రైతులు సదస్సు నిర్వహించబోతున్నారు. గురువారం తుళ్లూరులో ‘రాజధాని నిజస్వరూపం'పేరుతో సదస్సు నిర్వహిస్తామని ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: