దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఘటన మరవక ముందే మరో దారుణం జరిగింది. ఉత్తరప్రదేశ్ లో నిందితుడు అత్యాచార బాధితురాలిని సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించాడు. ఉన్నావో గ్రామ సమీపంలో ఈ దారుణం చోటు చేసుకుంది. కొన్ని నెలల క్రితం ఉన్నావో కు చెందిన యువతిపై అత్యాచారం జరిగింది. అత్యాచార బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. 
 
నిందితుడు కొన్ని రోజుల క్రితం బెయిల్ పై విడుదలయ్యాడు. అత్యాచార బాధితురాలు జైలుకు పంపిందనే కక్ష్యతో యువతిపై దాడి చేశాడు. నిందితుడు నలుగురు స్నేహితులతో కలిసి యువతిపై పెట్రోల్ పోసి సజీవదహనం చేయటానికి ప్రయత్నించాడు. బాధితురాలికి 80 శాతం కాలిన గాయాలయ్యాయి. ప్రస్తుతం యువతి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. పోలీసులు ఇప్పటికే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 
 
మిగతా ఇద్దరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయంగా ఈ ఘటన కలకలం సృష్టిస్తోంది. ప్రియాంక గాంధీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారిపోయాయని చెప్పటానికి ఈ ఘటనే ఉదాహరణ అని చెప్పారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ ఘటనకు బాధ్యత వహించాలని చెప్పారు. 
 
యువతి వయస్సు 20 సంవత్సరాలని సమాచారం. బాధిత యువతిపై పెట్రోల్ తో దాడి జరిగిన విషయం తెలియడంతో పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని మంటల్లో చిక్కుకున్న యువతిని రక్షించారు. యువతికి ప్రభుత్వ వైద్యశాలలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. బాధిత యువతి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఉన్నావో ప్రాంతంలో ఈ ఘటనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలు నిందితులకు కఠిన శిక్షలు విధించాలని, చట్టాల్లో మార్పులు తీసుకొనిరావాలని అప్పుడే నేరాలు తగ్గుముఖం పడతాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నిందితులకు ఉరి శిక్ష విధించాలని ఉన్నావో గ్రామ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: