మౌన‌మునిగా పేరొందిన మాజీ ప్ర‌ధాన‌మంత్రి మ‌న్మోహ‌న్ సింగ్ తాజాగా నోరువిప్పారు. వివాదాస్ప‌ద అంశం గురించి సంచ‌ల‌న కామెంట్లు చేశారు. మాజీ ప్ర‌ధాని ఐకే గుజ్రాల్ శ‌త‌జ‌యంతి ఉత్స‌వాల సంద‌ర్భంగా బుధ‌వారం జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో మ‌న్మోహ‌న్ మాట్లాడారు. 1997 ఏప్రిల్ నుంచి 1998 మార్చి వ‌ర‌కు గుజ్రాల్ ప్ర‌ధానిగా ఉన్నారు. న‌వంబ‌ర్ 30, 2012లో ఆయ‌న తుదిశ్వాస విడిచారు. గుజ్రాల్ జీవితంలో ముఖ్య‌మైన ఘ‌ట్ట‌మైన 1984లో జ‌రిగిన సిక్కుల ఊచ‌కోత‌పై మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ తాజాగా ఓ కామెంట్ చేశారు. మాజీ ప్ర‌ధాని ఐకే గుజ్రాల్ ఇచ్చిన స‌ల‌హాలు స్వీక‌రించి ఉంటే.. సిక్కుల ఊచ‌కోత జ‌రిగి ఉండేది కాద‌ని మ‌న్మోహ‌న్ అన్నారు. 

 

కాంగ్రెస్ నాయకురాలు, మాజీ ప్ర‌ధాని ఇందిరాగాంధీని  సిక్కు బాడీగార్డులే హ‌త్య చేశారు. ఈ హ‌త్య‌ అనంత‌రం ఢిల్లీలో భారీగా అల్ల‌ర్లు చోటుచేసుకున్నాయి. ఊచకోతలో దాదాపు 3వేల మంది ప్రాణాలు కోల్పోయారు. మాజీ ప్ర‌ధాని పీవీ న‌ర్సింహారావు ఊచ‌కోత స‌మ‌యంలో హోంమంత్రిగా ఉన్నారు. అయితే ఆ స‌మ‌యంలో ఆర్మీని రంగంలోకి దింపాల‌ని గుజ్రాల్ స‌ల‌హా ఇచ్చార‌ని, కానీ పీవీ ఆ స‌ల‌హాల‌ను ప‌ట్టించుకోలేద‌ని తాజాగా మ‌న్మోహ‌న్ సింగ్ వెల్ల‌డించారు. గుజ్రాల్‌ సలహాపై పీవీ స్పందించి ఉంటే సిక్కు వ్యతిరేక అల్లర్లు, ఊచకోత జరగకపోయేవ‌ని అంద‌రి ప్రాణాలు పోయేవి కావ‌ని మ‌న్మోహ‌న్ అన్నారు. మాజీ ప్ర‌ధాని ఇందిరా గాంధీని హ‌త్య అనంత‌రం ఊచ‌కోత ఘ‌ట‌న‌ ప‌ట్ల గతంలోనే మ‌న్మోహ‌న్ క్ష‌మాప‌ణ‌లు కూడా చెప్పారు. 

 

ఎమ‌ర్జెన్సీ స‌మ‌యంలో ఐకే గుజ్రాల్‌తో త‌న‌కు ఉన్న అనుబంధం గురించి కూడా మ‌న్మోహ‌న్ చెప్పారు. గుజ్రాల్‌ , తాను ఒకే జిల్లాలో పుట్టామని, రాజకీయాల్లో చాలా ఏళ్లు కలిసి పనిచేశామని తెలిపారు. కాగా ముఖ్య నేతలుఇద్ద‌రి గురించి కీల‌క‌మైన కామెంట్లు చేయ‌డం అందులోనూ దేశాన్ని కుదిపేసిన అంశం గురించి మ‌న్మోహ‌న్ సింగ్ ఇంత కాలం త‌ర్వాత నోరు విప్ప‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: