ఈరోజుల్లో రోడ్డుపై బైక్ ను తీసుకెళ్లాలంటే జేబులో కనీసం రూ 5000 అయినా ఉండాలి మరి ట్రాఫిక్ పోలీసులు విధించే ఫైనులు అలా ఉన్నాయి. హెల్మెట్ లేకపోతే రూ 1000, సిగ్నల్ జంప్ కి రూ 1000, రాష్ డ్రైవింగ్ కి రూ 5000 అంటూ బైకర్ల నుంచి భారీగా ఫైనులు వసూల్ చేస్తున్నారు. కానీ దీనికి బిన్నంగా గుజరాత్ రాష్ట్రము తమ రాష్ట్ర ప్రజలకి హెల్మెట్ నుంచి మినహాయింపు ఇచ్చింది. 

 

గుజరాత్ రాష్ట్రము లోని బైకర్లు హెల్మెట్ వాడడం తప్పనిసరి కాదంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. "రాష్ట్ర ప్రజలకు ఒక విజ్ఞప్తి, రాష్ట్రంలోని మునిసిపల్ పరిధిలో బైకులు నడిపే వారికి హెల్మెట్ తప్పనిసరి కాదు" అంటూ ప్రభుత్వం పేర్కొంది. అయితే గ్రామీణ రోడ్లు, నేషనల్ హైవేస్ మీద బైకులు నడిపేటప్పుడు మాత్రం హెల్మెట్ తప్పనిసరి అంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది. 

 

పట్టణాలు మరియు నగరాల్లో తిరిగే బైకర్లకు మాత్రం హెల్మెట్ తప్పనిసరి కాదంటూ గుజరాత్ మంత్రి పేర్కొన్నారు. గల్లీల్లో హెల్మెట్ పెట్టుకొని బైక్ నడపడం చాలా కష్టంగా ఉంది, దీనిపై ఒక ఆలోచన చేసి గల్లీల్లో బైక్ నడిపే వారికి హెల్మెట్ ధారణపై మినహాయింపు ఇవ్వాలని ప్రజలు విజ్ఞప్తి చేసిన మేరకు గుజరాత్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ నిర్ణయం పట్ల గుజరాత్ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

 

ఇక దేశ వ్యాప్తంగా ట్రాఫిక్ నిబంధనలు చాలా స్ట్రిక్ట్ గా అమలు చేస్తున్నారు ట్రాఫిక్ అధికారులు. నిబంధనలు అతిక్రమిస్తే కఠినంగా ఫైనులు వసూల్ చేయడంతో పాటుగా కొన్ని నిబంధనలు అతిక్రమిస్తే జైలు శిక్షలు కూడా అమలు చేస్తున్నారు. హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే రూ 1000 జరిమానా తో పాటుగా మూడు నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేసే అవకాశం ఉంది. 

 

ఈ ఏడాది ట్రాఫిక్ నిబంధనలు కఠినతరం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక బిల్లు ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే అయితే దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకత వ్యక్తం చేయడంతో కేంద్రం వెనక్కి తగ్గింది. ఈ నిబంధనల అమలును ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: