అగ్ర‌రాజ్యం అమెరికాలో మ‌రోమారు తుపాకి గుళ్ల మోత మోగింది. అయితే ఈ ద‌ఫా ఏ రెస్టారెంటో లేదంటే బార్‌లో కాదు...ఏకంగా కీల‌క‌మైన హ‌ర్బ‌ర్‌లో జరిగింది. హ‌వాయి రాష్ట్రంలో ఉన్న పెర‌ల్ హార్బ‌ర్‌లో జ‌రిగిన  కాల్పులు ఘ‌ట‌నలో భార‌త వాయుసేన ఎయిర్ చీఫ్ మార్ష‌ల్ ఆర్కేఎస్ భ‌దౌరియా తృటిలో త‌ప్పించుకున్నారు. యూఎస్ సెయిల‌ర్ ఈ దాడికి పాల్ప‌డిన‌ట్లు గుర్తించారు.   కాల్పుల్లో ఒక‌రు మృతి చెందార‌ని ప్రాథ‌మిక స‌మాచారం. 

 

హ‌వాయి రాష్ట్రంలో హోన‌లూలూలో  ఉన్న పెర‌ల్ హార్బ‌ర్ అమెరికా నౌకాద‌ళ సైన్యానికి కేంద్ర స్థానం. ఇక్క‌డ భారీ నౌక‌ల‌కు మ‌ర‌మ్మ‌తులు, నిర్వ‌హ‌ణ చేయ‌డంతో పాటుగా వాటిని ఆధునీక‌రిస్తారు. పెర‌ల్ హార్బ‌ర్‌లోనే సుమారు 10 డెస్ట్రాయ‌ర్లు, 15 స‌బ్‌మెరైన్లు కూడా ఉన్నాయి. ఇంత‌టి కీల‌క‌మైన ప్రాంగ‌ణంలో అన్ని దేశాల ఎయిర్ చీఫ్‌లతో జ‌రుగుతున్న స‌మావేశంలో పాల్గొనేందుకు ఎయిర్ చీఫ్ మార్ష‌ల్ ఆర్కేఎస్ భ‌దౌరియా వెళ్లారు. అధికారిక కార్య‌క్ర‌మాల్లో భాగంగా  భ‌దౌరియా సార‌థ్యంలోని  భార‌త వాయుసేన బృందం అక్క‌డ ప‌ర్య‌టిస్తున్న త‌రుణంలోనే...పెర‌ల్ హార్బ‌ర్ హిక్క‌మ్‌ జాయింట్ బేస్ వ‌ద్ద కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ప‌లువురు గాయ‌ప‌డ్డారు. కానీ భార‌తీయ వాయుద‌ళానికి ఎటువంటి ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌లేద‌ని భార‌త వాయుసేన స్ప‌ష్టం చేసింది. ఇదిలాఉండ‌గా, ఇండో ప‌సిఫిక్ ప్రాంతంలో భ‌ద్ర‌త అంశాన్ని చ‌ర్చించేందుకు ఐఏఎఫ్ చీఫ్ ఆర్కేఎస్‌ భ‌దౌరియాతో పాటు ఐఏఎఫ్ బృందం అమెరికాలో ప‌ర్య‌టిస్తోంది.

 

కాల్పుల ఘ‌ట‌న‌తో నౌకాద‌ళ బేస్‌ను కొన్ని గంట‌ల పాటు లాక్‌డౌన్ చేశారు. కాల్పుల్లో ముగ్గురు గాయ‌ప‌డిన‌ట్లు స్థానిక న్యూస్ ఏజెన్సీ చెప్పింది. కాల్పుల్లో ఒక‌రు మృతి చెందారని అయితే, ఎయిర్ చీఫ్‌తో పాటు అక్క‌డ‌కు వెళ్లిన భార‌తీయ‌ సిబ్బందికి ఏమీ కాలేద‌ని పేర్కొంది. యూఎస్ సెయిల‌ర్ ఈ దాడికి పాల్ప‌డిన‌ట్లు గుర్తించారని, ద‌ర్యాప్తు కొన‌సాగుతోంద‌ని తెలిపింది. ఇదిలాఉండ‌గా, రెండ‌వ ప్ర‌పంచ యుద్ధంలో జ‌పాన్ దాడి చేసింది ఈ నాకౌశ్ర‌యంపైనే కావ‌డం, రాబోయే శ‌నివారం ఆ దాడికి 78 ఏళ్ల నిండ‌నుండ‌నున్న త‌రుణంలో....ఈ ఘ‌ట‌న జ‌ర‌గ‌డం అంత‌ర్జాతీయంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: