పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు పి. చిదంబరం వేడి పుట్టించారు. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో బెయిల్‌పై విడుదలైన ఆయ‌న‌ గురువారం పార్ల‌మెంటుకు వ‌చ్చారు. ఇటు పార్ల‌మెంటు వ‌ద్ద‌ అనంత‌రం ప్ర‌త్యేకంగా నిర్వ‌హించిన విలేకరుల స‌మావేశంలో ప్ర‌భుత్వం తీరును చిదంబ‌రం తీవ్రంగా ఎండ‌గ‌ట్టారు. పార్లమెంట్‌లో తన గళాన్ని ప్రభుత్వం తొక్కేయలేదని ఆయ‌న తేల్చిచెప్పారు.

 


ఐఎన్‌ఎక్స్‌ మీడియా అక్రమ నగదు చలామణి కేసులో చిదంబరం జైలుపాల‌యిన సంగ‌తి తెలిసిందే. ఈ కేసులో సుప్రీంకోర్టు బుధవారం బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో గత 105 రోజులుగా కారాగారంలో ఉన్న ఆయన విడుదల అయ్యారు. అనంత‌రం కాంగ్రెస్ తాత్కాలిక అధ్య‌క్షురాలు సోనియాగాంధీని మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. అనంత‌రం పార్లమెంట్‌కు వచ్చిన చిదంబరం..పెరుగుతున్న ఉల్లిధరలపై కాంగ్రెస్ పార్టీ చేప‌ట్టిన ఆందోళనలో పార్టీ నేతలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఉల్లిపై చేసిన వ్యాఖ్యలపై చిదంబరం విమర్శలు చేశారు. ‘ఉల్లిగడ్డ తిననని ఆర్థిక మంత్రి చెప్పారు. దానర్థమేంటీ..? అంటే ఆవిడ అవకాడో తింటారా?’ అని ఎద్దేవాచేశారు.

 

రాజ్యసభ సమావేశాలకు హాజరైన చిదంబరం అనంతరం మీడియాతో మాట్లాడుతూ...ఆర్థిక అంశాలను లేవనెత్తారు. దేశ ఆర్థిక ప్రభుత్వం కుప్పకూల్చిందని..ఈ పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోడీ ఏమీ మాట్లాడకుండా మౌనం పాటిస్తున్నారని ఆరోపించారు. రిజర్వ్‌ బ్యాంకు వృద్ధి రేటును 7.4 శాతంగా అంచనా వేయ‌గా 5 శాతమే వచ్చిందని పేర్కొంటూ... అంచనా వేయడంలో రిజర్వ్‌ బ్యాంక్‌ అసమర్థత అనుకోవాలా? లేక వృద్ధి సాధించలేని ప్రభుత్వ అసమర్థత అనుకోవాలా? అని ఆయన ప్రశ్నించారు. ఆర్థిక వ్యవహారాల్లో కేంద్రం అసమర్థ మేనేజర్‌గా మిగిలిందని చిదంబ‌రం ఆరోపించారు. మాజీ ఆర్థిక మంత్రిగా త‌న‌పై వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌కు స‌మాధానం ఇస్తూ, తాను విత్త‌మంత్రిగా పని చేసిన సమయంలో తానేం చేశానో అందరికీ తెలుసునని విమర్శ‌ల‌ను తిప్పికొట్టారు. 

 


కాగా, త‌న‌పై న‌మోదైన కేసు గురించి చిదంబరం స్పందించ‌లేదు. ఇందుకు బెయిల్‌ సందర్భంగా న్యాయస్థానం విధించిన షరతులు కార‌ణం. కేసులో తన గురించి గానీ, సహ నిందితుల గురించి గానీ పత్రికలకు ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని, బహిరంగ వ్యాఖ్యలు చేయరాదని, సాక్షులను ప్రభావితం చేయరాదని వెల్లడించింది. దీంతో మీడియా సమావేశంలో చిదంబరం ఆ విష‌యం మాట్లాడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: