అనంతపురం జిల్లాలోని పెనుగొండలో ఉన్న కియా ఫ్యాక్టరీ ఓపెనింగ్ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఉదయం 11 గంటల సమయంలో సీఎం జగన్ కియా ఫ్యాక్టరీకి చేరుకున్నారు. సీఎం జగన్ కియా యాజమాన్యంతో కూడా సమావేశం అయ్యారు. అధికారులను అడిగి సీఎం జగన్ వివరాలను తెలుసుకున్నారు. సీఎం జగన్ కియా పరిశ్రమలోని అన్ని విభాగాలను పరిశీలించారు. జగన్ కియా ఫ్యాక్టరీ డాక్యుమెంటరీ చిత్రాన్ని వీక్షించారు. 
 
సీఎం జగన్ మాట్లాడుతూ కియా మోటార్స్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. మరికొన్ని కంపెనీలు కియా మోటార్స్ బాటలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తాయని సీఎం జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు. కియా ఫ్యాక్టరీని పెనుగొండలో ప్రారంభించడం సంతోషంగా ఉందని జగన్ అన్నారు. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో కియా పరిశ్రమ ఏర్పాటు కావటం శుభపరిణామం అని సీఎం జగన్ అన్నారు. 
 
కియా సంస్థ ఇంత పెద్ద పరిశ్రమను ఏపీలో ఏర్పాటు చేసినందుకు అభినందిస్తున్నానని సీఎం జగన్ చెప్పారు. కియా యాజమాన్యానికి సీఎం జగన్ ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. దక్షిణ కొరియా సంస్థ కియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కియా ఫ్యాక్టరీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి కృషితో ఏపీలో ఈ పరిశ్రమ ఏర్పాటైంది. 13,500 కోట్ల రూపాయల ఖర్చుతో కియా కార్ల పరిశ్రమ ఏర్పాటైంది. ఈ కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, గుమ్మనూరు జయరాం, శంకర్ నారాయణ, గౌతం రెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యేలు డాక్టర్ సిద్ధారెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గుర్నాథ్ రెడ్డి, విశ్వేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 
 
ఈ కార్యక్రమం తరువాత సీఎం జగన్ అనంతపురం ఎంపీ, ఎమ్మెల్యేలతో సమావేశమై సంక్షేమ పథకాలు, అభివృద్ధి గురించి చర్చించనున్నారు. అనంతపురం - బెంగళూరు పారిశ్రామిక కారిడార్ గురించి, సోమందేపల్లిలో ఎలక్ట్రిక్ బస్సుల తయారీ పరిశ్రమ గురించి చర్చించబోతున్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: