దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్య కేసులో నిజాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మొదట దిశ చనిపోయిన తరువాత కాల్చి చంపామని చెప్పిన నిందితులు ఆ తరువాత దిశ బ్రతికి ఉండగానే కాల్చి చంపినట్లు చెప్పారు. పోలీసుల విచారణలో తాజాగా మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. దిశ కేసులో కీలక ఆధారమైన దిశ మొబైల్ నిందితులు పాతిపెట్టినట్లు విచారణలో అంగీకరించారు. 
 
పోలీసులు మొదట దిశ మొబైల్ ను నిందితులు మంటల్లో వేసి ఉంటారని భావించినా పోలీసుల విచారణలో మొబైల్ పాతిపెట్టినట్లు తేలింది. పొలీసులు ఇప్పటికే మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారని సమాచారం. పోలీసులు ప్రస్తుతం దిశ మొబైల్ లోని కాల్ డేటా, కాల్ లిస్ట్ ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. క్లూస్ టీమ్ ఘటన జరిగిన స్థలంలో మరోసారి తనిఖీలు నిర్వహిస్తోంది. 
 
సైబరాబాద్ పోలీసులు దిశ హత్య కేసులో విచారణను ఇప్పటికే వేగవంతం చేశారు. దిశ కేసులో సాక్ష్యాలను సేకరించటం కోసం ఇప్పటికే ఏడు బృందాలు రంగంలోకి దిగాయి. శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి నేతృత్వంలో విచారణ బృందం ఇప్పటికే ఏర్పాటైంది. సిట్ బృందం నలుగురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారించనుంది. నిందితులకు కఠిన శిక్షలు విధించాలని ప్రజల నుండి డిమాండ్లు వినిపిస్తున్నాయి. 
 
దిశ ఘటన రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దేశవ్యాప్తంగా దిశ ఘటన మరవకముందే మరిన్ని ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. చట్టాల్లో మార్పులు చేయాలని అత్యాచార ఘటనల్లో వేగంగా నిందితులను శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అత్యాచారానికి పాల్పడిన నిందితులపై కేసు పెట్టినందుకు ప్రతీకారంగా నిందితులు భాదితురాలిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. ప్రభుత్వాలు కఠిన చట్టాలు అమలులోకి తెస్తే మాత్రమే నేరాల సంఖ్య తగ్గే అవకాశం ఉందని ప్రజల నుండి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: