ఒకే దేశం, ఒకే పన్ను, ఒకే మార్కెట్...ఈ నినాదంతో దాదాపు రెండున్నరేళ్ల‌ క్రితం ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ సర్కారు తెచ్చిన చారిత్రాత్మక సంస్కరణ జీఎస్టీ. జీఎస్టీకి ముందుతో పోల్చితే పన్నుల ఆదాయం పడిపోయిందన్న ఆందోళన ప్రభుత్వంలో స్పష్టంగా కనిపిస్తున్న త‌రుణంలో...ప్ర‌ధాన‌మంత్రి ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన జీఎస్టీ విఫలమైందా? అన్న అనుమానాలు ఇప్పుడు కలుగుతున్నాయి. రాష్ర్టాలకు జీఎస్టీ నష్టపరిహారాన్ని కేంద్రం చెల్లించలేకపోతుండటం ఈ అనుమానాలను మరింత ధ్రువపరుస్తుండ‌టం గ‌మ‌నార్హం.

 

 

అటు కేంద్రంలో, ఇటు రాష్ర్టాల్లో ఉన్న డజనుకుపైగా పన్నులను ఏకం చేసి పరిచయం చేసిన జీఎస్టీ పరిధిలో 500లకుపైగా సేవలు, 1,300లకుపైగా వస్తువులున్నాయి. 0, 5, 12, 18, 28 శాతాల్లో ఆయా వస్తు, సేవలపై పన్నులను విధించారు. బంగారంపై ప్రత్యేకంగా 3 శాతం పన్ను వేయగా, విలువైన ముడి రత్నాలు, రాళ్లపై కనిష్ఠంగా 0.25 శాతం పన్ను నిర్ణయించారు. ఇక పెట్రో ఉత్పత్తులను జీఎస్టీలో చేర్చని కేంద్రం.. విద్య, వైద్యం, తాజా కూరగాయలు తదితరాలకు ఈ పన్ను నుంచి మినహాయింపునిచ్చింది. జూలై 1, 2017 నుంచి దేశవ్యాప్తంగా జీఎస్టీ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. కేంద్ర, రాష్ర్టాల పన్నులను కలిపి తెచ్చిన జీఎస్టీతో రాష్ర్టాలకు ఆదాయం దూరమవుతోంది. దీంతో రాష్ర్టాలకు నష్టపరిహారం చెల్లించేందుకు కేంద్రం అంగీకరించింది. రెండు నెలలకోసారి ఈ నష్టపరిహారాన్ని కేంద్రం విడుదల చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) ఏప్రిల్-జూలైకిగాను జీఎస్టీ నష్టపరిహారంగా రాష్ర్టాలకు కేంద్రం రూ.45,744 కోట్లను చెల్లించింది. ఆగస్టు-సెప్టెంబర్ నెలలకు రూ.18,784 కోట్లను ఇవ్వాల్సి ఉంది.

 

నిజానికి పన్ను వసూళ్లకు సంబంధించి ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యాలన్నీ దాదాపు విఫలమవుతూనే ఉన్నాయి. ప్రజలు, వ్యాపార, పారిశ్రామిక రంగాల విన్నపాలతో గరిష్ఠ శ్లాబుల్లోని వస్తు, సేవలను కేంద్రం.. దిగువ శ్రేణి శ్లాబుల్లోకి మార్చుతూ వస్తుండటం వసూళ్లను ప్రభావితం చేస్తోంది. దీంతో ఆదాయం పడిపోగా, రాష్ర్టాలకు నష్టపరిహారం పెను భారంగా మారుతోంది.  తగ్గిన ఆదాయం కారణంగానే నష్టపరిహారం ఇవ్వలేకపోతున్నామని రాష్ర్టాలకు కేంద్రం లిఖితపూర్వకంగా వివరిస్తున్నది. ఫలితంగా జీఎస్టీ.. మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థకే గుదిబండగా మారిందా? అన్న భయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా మోదీ స‌ర్కారు ఆశించింది ఒక‌టైతే..జ‌రుగుతోంది ఇంకొక‌టని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: