మ‌రో భారీ స్కాం వివ‌రాలు వెలుగులోకి వ‌చ్చాయి. ఈఎస్‌ఐ దవాఖానాలకు, డిస్పెన్సరీలకు మందులు కొనుగోలుచేసి సరఫరాచేసే సంస్థ ఐఎంఎస్ (ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్) డైరెక్టరేట్‌లో భారీ కుంభకోణం బయటపడిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఐఎంఎస్ డైరెక్టర్ డాక్టర్ సీహెచ్ దేవికారాణి ఇప్ప‌టికే అరెస్టు అయ్యారు. అయితే, ఈ మందుల కుంభకోణంలో నిందితుడు, దేవికారాణి భర్త గురుమూర్తిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. సంచలనం సృష్టించిన మెడికల్ స్కాంలో దేవికారాణి, ఆమె భర్త గురుమూర్తిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైంది. 

 


ఈ నెల 3వ తేదీన దేవికారాణికి సంబంధించిన కుటుంబ సభ్యుల ఇళ్లలో అవినీతి నిరోధకశాఖ అధికారులు సోదాలు చేపట్టిన విషయం తెలిసిందే. దేవికారాణి, ఆమె కుటుంబ సభ్యుల పేరు మీద భారీగా ఆస్తులున్నట్లు గుర్తించారు. సుమారు రూ.100 కోట్ల మేర స్థిరాస్తులు ఉన్నట్లు అధికారులు తేల్చారు.దేవికారాణి తరపున ఔషద పరిశ్రమ నుంచి గురుమూర్తి లంచాలు తీసుకున్నట్లుగా సమాచారం. ఈ క్ర‌మంలో దేవికారాణి భర్త గురుమూర్తిని అరెస్టు చేశారు.  నిందితుడిని ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరిచి చంచల్‌గూడ జైలుకు తరలించారు.

 


పక్కా ఆధారాలతో ఏసీబీ అధికారులు ఏకకాలంలో 23 చోట్ల సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. కార్మిక బీమా వైద్య సేవల సంచాలకురాలు దేవికారాణి, జాయింట్ డైరెక్టర్ పద్మ, అసిస్టెంట్ డైరెక్టర్ వసంత, ఫార్మాసిస్ట్‌లు ఎం. రాధిక, జ్యోత్స్న, ఫాతిమా, లావణ్య, నాగలక్ష్మి, రిటైర్డ్ ఫార్మాసిస్ట్ సబితా, సీనియర్ అసిస్టెంట్లు సురేంద్రనాథ్, హర్షవర్ధన్, పావని, రికార్డు అసిస్టెంట్ రాజశేఖర్, సూపరింటెండెంట్లు సురేశ్ అగర్వాల్, వీరన్న, ఆఫీస్ అసిస్టెంట్ శ్రీనివాసరావు, ఎండీ శ్రీధర్, నాగరాజు, సుధాకర్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి నివాసాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. పలు కీలకపత్రాలను ఏసీబీ అధికారులు గుర్తించారు. ఏసీబీ అధికారుల ప్రకటన ప్రకారం..ఇప్పటి వరకు వంద కోట్ల‌కు పైగా అక్రమాస్తులు వెలుగుచూశాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: