దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టిస్తున్న దిశ ఘ‌ట‌న‌లో అరెస్టుల ప‌రంప‌ర కొన‌సాగుతోంది. దిశ అత్యాచారం, హత్యపై రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించడంలేదని సోషల్ సైట్లలో విమర్శలు వెల్లువెత్తాయి. బాధితురాలి కుటుంబానికి జరిగిన అన్యాయంపై మ‌రికొంద‌రు ఫేస్‌బుక్, ట్విట్టర్లో నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ఈ క్రమంలోనే సీఎం కూతురు మాజీ ఎంపీ కవితపై సోషల్ మీడియాలో కొందరు యువకులు అభ్యంతరకరంగా పోస్టింగ్స్ చేయ‌గా ఇద్ద‌రిని అరెస్ట్ చేశారు. ఇదిలాఉండ‌గా, మహిళల పట్ల అసభ్య వ్యాఖ్యానాలు చేసిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. 

 

దిశ ఘటనపై ఫేస్‌బుక్‌లో అసభ్య వ్యాఖ్యానాలు పెట్టిన ఏపీలోని గుంటూరు జిల్లా కొత్తపేటకు చెందిన అమర్‌నాథ్(18)ను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. టిక్‌టాక్‌లో మహిళలను కించపరిచే విధంగా వ్యవహరించిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. కరీంనగర్ జ్లిలా మెట్‌పల్లికి చెందిన అరవింద్, అనంతపురానికి చెందిన నిమేశ్ చౌదరిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిమేశ్, అరవింద్ టిక్‌టాక్‌లో ఒకరికొకరు పరిచయమయ్యారు. ఇరువురు టిక్‌టాక్, వాట్సప్ గ్రూపుల్లో మహిళల పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తుండటంపై నగరంలోని కేపీహెచ్‌బీకి చెందిన జనార్దన్ చేసిన ఫిర్యాదుపై సైబరాబాద్ సైబర్ క్రై పోలీసులు చర్యలు తీసుకొని అరెస్ట్ చేశారు.

 

 

ఇదిలాఉండ‌గా, నిందితులకు వేగంగా శిక్ష పడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే. దిశ కేసులో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటుచేస్తామని ఇటీవల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ కేసులో బాధిత కుటుంబసభ్యులకు సత్వర న్యాయం అందించడంతోపాటు నిందితులకు వేగంగా శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు హైకోర్టుతో న్యాయశాఖ సంప్రదింపులు జరిపింది. హైకోర్టు ఆమోదంతో ఈ కేసులో విచారణకు ప్రత్యేకంగా ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ఏర్పాటుచేస్తూ న్యాయశాఖ కార్యదర్శి ఏ సంతోష్‌రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. మహబూబ్‌నగర్ ఒకటో అదనపు జిల్లా సెషన్స్ జడ్జి కోర్టును ఫాస్ట్‌ట్రాక్ కోర్టుగా గుర్తిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: