కర్ణాటకలో యడ్యూరప్ప ప్రభుత్వం మరో  పరీక్ష ముందు నిలబడింది. ఈ రోజు జరిగిన ఉప ఎన్నికల పోలింగ్‌ బీజేపీ ప్రభుత్వం  మనుగడకు జీవన్మరణ సమస్యగా మారడంతో.. ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. కనీసం 7 చోట్ల బీజేపీ విజయం సాధించకపోతే.. కన్నడ రాజకీయం హీటెక్కడం ఖాయం.

 

కర్ణాటకలో యడ్యూరప్ప ప్రభుత్వ మనుగడను నిర్ణయించే 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్‌ ముగిసింది. ఇక అందరి దృష్టి ఈ నెల 9న వెల్లడయ్యే ఫలితాలపై ఉంది. జేడీఎస్‌, కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వం పడిపోవడం..  బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు కావడంలో 17మంది ఎమ్మెల్యేలు  కీలక పాత్ర పోషించారు. వారిపై అనర్హత  వేటు పడటంతో.. 15 చోట్ల ఉపఎన్నికలు జరిగాయి. బెంగళూరు పరిధిలోని కేఆర్‌ పురం, యశ్వంత్‌పూర్‌, మహాలక్ష్మీ లే అవుట్‌, శివాజీనగర్‌ నియోజకవర్గాలున్నాయి. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలను శిక్షించాలని కేఆర్‌ పురంలో బ్యానర్లు పెట్టడం కలకలం రేపింది. 

 

15చోట్లా రెబల్‌ ఎమ్మెల్యేలనే బీజేపీ బరిలో దించగా.. జేడీఎస్‌ 12, బీఎస్పీ 2, ఎన్సీపీ ఒకచోట్ల పోటీ చేస్తున్నాయి. ఎమ్మెల్యేల అనర్హతను సమర్ధించిన సుప్రీంకోర్టు... ఉప ఎన్నికల్లో పోటీకి గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో.. బీజేపీ కాస్త ఊపిరి పీల్చుకొని వారికే టికెట్లు ఇచ్చింది. వారి గెలుపును స్వయంగా భుజాన వేసుకున్నారు సీఎం యడ్యూరప్ప. 

 

224 మంది సభ్యులున్న కర్ణాటక అసెంబ్లీలో ప్రస్తుతం బీజేపీకి 105 (ఒక స్వతంత్ర ఎమ్మెల్యేతో కలిపి), కాంగ్రెస్‌ 66, జేడీఎస్‌ 34, బీఎస్పీ 1, నామినేటెడ్‌ ఎమ్మెల్యే  ఉన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్‌ ఫిగర్‌ 113. దీంతో యడ్యూరప్ప  ప్రభుత్వ భవిష్యత్తును ఈ ఎన్నికలే తేల్చనున్నాయి. ప్రభుత్వ మనుగడకు ఈ ఉప ఎన్నికలు కీలకం కానున్నాయి. ప్రస్తుతం బీజేపీకి 105 సీట్లున్నాయి. మరో  ఎనిమిది సీట్లు వస్తేనే ప్రభుత్వం కొనసాగే అవకాశాలుంటాయి. దీంతో ఈ నెల 9న వెల్లడయ్యే ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఉపఎన్నికల్లో అన్ని స్థానాలూ బీజేపీనే గెలుచుకుంటుందని డిప్యూటీ సీఎం లక్ష్మణ్‌ సవాడి విశ్వాసం వ్యక్తంచేశారు. బీఎస్‌ యడియూరప్పే సీఎంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. తమ ప్రభుత్వం ప్రజానుకూల విధానాలను అనుసరిస్తోందన్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: