ఒక వైపు దిశ ఘటనపై దేశవ్యాప్తంగా ఉవ్వెత్తున ఉద్యమం సాగుతున్న సమయంలోనే .. అత్యంత విషాదకరమైన మరో ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. అత్యాచార బాధితురాలకి నిప్పు పెట్టారు దుండగులు. రక్షించాలని ఆర్తనాదాలు చేస్తూ .. కాలిన గాయాలతోనే.. కిలోమీటరు నడిచిందా అభాగ్యురాలు. ఆపై స్వయంగా 112కు ఫోన్‌ చేసి తన గోడు వెళ్లబోసుకుందా మహిళ. 

 

ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌ మరోసారి వార్తల్లో నిలిచింది. శంషాబాద్‌లో దిశను చంపేసినట్లే.. అత్యాచార బాధితురాలిని సజీవ దహనం చేసే యత్నం చేశారు కిరాతకులు. 90 శాతం కాలిన గాయాలతో.. కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతోందా అభాగ్యురాలు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌  సింధునూర్‌లో జరిగింది.  దిశ ఘటన మాదిరే దేశవ్యాప్తంగా ఈ అంశంపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. పార్లమెంట్ కూడా కాసేపు స్తంభించింది. ఉన్నావ్‌కు చెందిన 23 ఏళ్ల మహిళపై గత ఏడాది డిసెంబర్‌లో ఇద్దరు గ్యాంగ్‌రేప్‌నకు పాల్పడ్డారు. బాధితురాలు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. దీంతో ఆమెను కోర్టును ఆశ్రయించడంతో ఈ ఏడాది మార్చిలో కేసు రిజిస్టర్‌ చేశారు పోలీసులు. ఒక నిందితుడు అరెస్ట్‌ కాగా.. మరో నిందితుడు ఆనాటి నుంచీ పరారీలో ఉన్నాడు.  కేసు విచారణ కోసం ప్రతీ వాయిదాకు బాధితురాలు రాయ్‌బరేలీలోని కోర్టుకు వెళ్తోంది. 

 

అలా వాయిదాకు వెళ్తున్న సమయంలో సింధునూర్‌ దగ్గర ఐదుగురు వ్యక్తులు  బాధితురాలిని అటకాయించారు. తీవ్రంగా కొట్టారు. ఆపై నిప్పు పెట్టి పారిపోయారు. తనను రక్షించాలని బాధితురాలు కాలిన గాయాలతో ప్రాధేయపడ్డా గ్రామస్థులు ఎవ్వరూ కనికరించలేదు. అయినా 90 శాతం కాలిన గాయాలతో కాపాడాలంటూనే కిలోమీటర్‌ నడుచుకుంటూ వెళ్లిందా యువతి. చివరకు ఒక ఇంటి దగ్గర ఆగి.. ప్రాధేయపడింది. ఆ ఇంట్లో వారి నుంచి సెల్‌ ఫోన్‌ తీసుకుని స్వయంగా తానే 112కు ఫోన్‌ చేసి కాపాడాలని కోరింది. బాధితురాలి ఫోన్‌ తర్వాతే ఘటనా స్థలానికి అంబులెన్స్‌ చేరుకుంది. ఆమెను ఆస్పత్రికి తరలించారు. 

 

అత్యాచార నిందితులపై  కేసు పెట్టినందుకే ప్రతీకారంగా బాధితురాలికి నిప్పుపెట్టారు దుండగులు. ఈ విషయం మీడియాలో ప్రముఖంగా రావడంతో దేశమొత్తం నివ్వెరపోయింది. నిందితులను పట్టుకోవాలని, ఘటనపై నివేదిక ఇవ్వాలని సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఆదేశించారు. ఆ వెనువెంటనే ఐదుగురు నిందితులు.. హరిశంకర్‌ త్రివేది, రామ్‌ కిషోర్‌ త్రివేది, ఉమేష్‌ బాజ్‌పేయి, శివం, శుభం త్రివేదిలను అరెస్ట్‌ చేశారు పోలీసులు. యువతిపై అత్యాచారం చేసిన నిందితుడు కూడా వీరిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మెరుగైన చికిత్సకు ప్రభుత్వం ఆదేశించడంతో బాధితురాలిని లక్నో ఆస్పత్రికి.. అక్కడ నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు అధికారులు. 

జాతీయ మహిళ కమిషన్‌ సైతం ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే నివేదిక సమర్పించాలని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అటు రాజకీయ పక్షాలు కూడా మోడీ, యోగి ప్రభుత్వాలపై  తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టాయి. రాజ్యసభలో ఈ  ఘటనపై ప్రత్యేక చర్చకు కాంగ్రెస్‌ ఎంపీ ఆనందశర్మ డిమాండ్‌ చేశారు. అరగంటసేపు సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు కాంగ్రెస్‌ సభ్యులు.

మరింత సమాచారం తెలుసుకోండి: