రైతులపై వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని జనసేన అధినేత పవన్ విరుచుకుపడ్డారు. మదనపల్లి టమోటా మార్కెట్ కు వెళ్లిన పవన్.. రైతులతో ముఖాముఖి నిర్వహించారు. జనసేన కార్యకర్తల మీటింగ్ లో వెలుగు కోఆర్డినేటర్లను కలిసిన జనసేనాని.. ఉద్యోగాలు ఇవ్వడమంటే.. ఉన్న పోస్టులు పీకేయడం కాదని మండిపడ్డారు. 

 

వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచీ.. భవన నిర్మాణ కార్మికుల పొట్ట కొట్టిందని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. చిత్తూరు జిల్లా మదనపల్లి టమోటా మార్కెట్ ను సందర్శించిన పవన్.. రైతుల కష్టాలు అడిగి తెలుసుకున్నారు. రైతు కష్టమేంటో తనకు తెలుసన్న పవన్.. అందరికీ అన్నం పెట్టే రైతును రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు అండగా ఉంటామని పాదయాత్రలో హామీలిచ్చిన జగన్.. ఇప్పుడు టమోటా రైతుల్ని ఆదుకోవాలని జనసేనాని డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో రైతులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోకపోతే.. అమరావతిలో భారీ ప్రదర్శన చేస్తామని హెచ్చరించారు పవన్. 

 

ఐదు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిన వైసీపీ.. ఇప్పటివరకు రెండు లక్షల 70 వేల ఉద్యోగాలిచ్చిందన్నారు పవన్ కళ్యాణ్. కానీ అందరూ కొత్త ఉద్యోగాలు సృష్టిస్తారని అనుకుంటే.. నాలుగు లక్షల ఉద్యోగాలు పీకేశారని మండిపడ్డారు జనసేనాని. వెలుగు కోఆర్డినేటర్లపై ఎందుకు కక్ష సాధిస్తున్నారని, ఉద్యోగాలు ఇవ్వడమంటే.. మీకు అనుకూలమైన వారికి పోస్టులు ఇవ్వడమా అని నిలదీశారు. 

 

మదనపల్లి మార్కెట్ కు రాకుండా వైసీపీ అడ్డుకునే ప్రయత్నం చేసిందని పవన్ ఆరోపించారు. ప్రభుత్వం ఆపితే ఇక్కడ ఎవరూ ఆగరని చెప్పారు. రైతులకు గిట్టుబాటు ధర వచ్చేవరకు జనసేన పోరాటం చేస్తుందని ప్రకటించారు పవన్. పెప్సీ, కోకకోలా లాంటి శీతల పానీయాలు తాగనని, అందుకే బ్రాండ్ అంబాసిడర్ గా తప్పుకున్నానని పవన్ చెప్పారు. మొన్నటి దాకా ఇసుక సమస్యపై పోరాటం చేసిన పవన్ కళ్యాణ్.. ఇపుడు టమోటా ధరలపై దృష్టిపెట్టారు. ఇపుడు ఏకంగా రైతుల దగ్గరకే వెళ్లి వాళ్ల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రభుత్వం వారి సమస్యలను తీర్చాలని డిమాండ్ చేస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: