తెలంగాణలో తెలుగు దేశం పార్టీ పరిస్థితి ఏమైందో చూశాం. కేసీఆర్ రాజకీయం దెబ్బకు.. ఆ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. ఇప్పుడు తాజా పరిస్థితులు.. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు గమనిస్తుంటే.. ఆంధ్రప్రదేశ్ లోనూ ఆ పార్టీకి రాను రాను అదే పరిస్థితి ఎదురయ్యేలా కనిపిస్తోంది. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి జాతీయ స్థాయిలో సన్నిహిత సంబంధాలే ఉన్నాయని చాలా మంది భావిస్తున్నారు. దక్షిణాదిలో బలపడాలని భావిస్తున్న బీజేపీకి.. టీడీపీతో తెగదెంపుల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ తో చెలిమి తప్పనిసరిగా కనిపిస్తోంది.

 

ఇలాంటి పరిస్థితుల్లో.. ఓ సారి వైసీపీ ఎంపీ విజయసాయి గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకోవాల్సి ఉంది. తాము ఏం చేసినా మోడీ, అమిత్ షా ఆశీస్సులు ఉంటాయని ఆయన అన్న వ్యాఖ్యను ఇప్పుడు ప్రస్తావించాల్సి ఉంది. ఎందుకంటే.. ఢిల్లీ నుంచి అందుతున్న సంకేతాల ప్రకారం.. త్వరలోనే వైసీపీ.. ఎన్డీయే గూటికి చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మహారాష్ట్రలో శివసేన.. ఎన్డీయేకు దూరమైన దరిమిలా.. దక్షిణాదిలో బలమైన పార్టీల్లో ఒకటైన వైసీపీని అక్కున చేర్చుకుంటే.. బలం పెరగడమే కాదు.. భవిష్యత్తులోనూ ప్రయోజనమే అన్న భావనలో బీజేపీ ఉందట.

 

ఇటు జగన్ పరిస్థితి చూస్తే.. ఇప్పటికే బోలెడు కేసులు. పైగా చార్జ్ షీట్లలో ఏ1 ముద్దాయిగా ఆరోపణలు. అయినా.. ఎన్నికల్లో అనూహ్య ప్రభంజనం సృష్టిస్తూ జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ అధికారాన్ని కాపాడుకోవాలన్నా.. కేసుల నుంచి ఉపశమనం పొందాలన్నా.. ఇప్పటికిప్పుడు రాజకీయంగా ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలన్నా.. తన వ్యవహారాలకు ఇబ్బంది రాకుండా ఉండాలన్నా.. జగన్ కు జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న పార్టీ అండ అవసరం. అందుకే.. ఆయన కూడా అవసరమైతే బీజేపీతో కలసి నడిచేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం.

 

ఈ ఊహాగానాలు వాస్తవ రూపం దాలిస్తే.. ఇక ముందు ముందు టీడీపీకి చుక్కలే అంటున్నారు.. రాజకీయ పరిశీలకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: