దిశ హత్యాచారం కేసు దేశ వ్యాప్తంగా ఎంతటి ప్రకంపనలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతి కిరాతకంగా ప్రవర్తించిన నిందితులు నలుగురినీ వెంటనే ఉరి తీయాలని.. బహిరంగంగా శిక్ష వేయాలని డిమాండ్లు విపరీతంగా వినిపించాయి. ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. అంతెందుకు.. ఆ నలుగురు నిందితులను అరెస్టు చేసినప్పుడు, కోర్టులో ప్రవేశ పెట్టినప్పుడు జరిగిన ఆందోళనలు, ధర్నాలు అంత సులభంగా మరిచిపోలేం. ఇప్పటికీ ఆ వేడి అలాగే కొనసాగుతోంది.

 

ఈ వ్యవహారంలో విద్యార్థి సంఘాల నాయకుల హెచ్చరికలు కూడా మొదలయ్యాయి. తప్పు చేశారని తేలింది కాబట్టి.. నిందితులను త్వరగా ఉరి తీయాలన్న డిమాండ్లు విద్యార్థి నాయకుల నుంచి వ్యక్తమవుతున్నాయి. లేదంటే.. వారిని తామే చంపేస్తామన్న హెచ్చరికలూ వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆ నలుగురి భద్రత ప్రశ్నార్థకంగా మారింది. అంతే కాదు.. ఇంతటి వ్యతిరేకతను ఎదుర్కొంటున్న వారి మానసిక పరిస్థితిపైనా పోలీసులు ఎప్పటికప్పుడు అప్ డేట్ తెలుసుకుంటున్నారు.

 

వారి దరిదాపుల్లోకి ఎవరినీ వెళ్లకుండా భారీ స్థాయిలో భద్రత కల్పిస్తున్నారు. కనీసం వారు శౌచాలయానికీ వెళ్లకుండా.. వాష్ రూమ్ ఉన్న గదిలోనే వారిని ఉంచుతున్నారు. వారు బయటికి వచ్చినా.. ఎవరికైనా కనిపించినా.. జనాలు ఎలా స్పందిస్తారో అని అంతా భయపడుతున్నారు. వీరికి శిక్ష పడడం ఖాయమే అంటున్న పోలీసులు.. ఈ క్రమంలో ఏదైనా ఉద్రిక్తతలు తలెత్తితే కష్టమని.. అంతా సంయమనంతో ఉండాలని కోరుతున్నారు.

 

ప్రస్తుతం ఆ నలుగురు నిందితులు పోలీసుల కస్టడీలో ఉన్నారు. సంఘటన తీరుపై ఇప్పటికే విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి తెచ్చిన పోలీసులు.. ఇంకా ఏమైనా గుట్టు దాగి ఉందా అన్న కోణంలో కస్టడీలో దర్యాప్తు చేస్తున్నారు. మరో వైపు.. ఆ నలుగురికి సంబంధించిన కుటుంబీకులు కూడా.. తమ వాళ్లు నిజంగా తప్పు చేస్తే శిక్షించాలంటూ బాధతో ప్రకటనలు ఇచ్చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో తర్వాత ఏం జరుగుతుందన్నది ప్రస్తుతం అందరిలో చర్చనీయాంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: