తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రముఖ సినీ నటుడు బాబూ మోహన్ మంచి స్నేహితులని.. ఒకరినొకరు బావా అని పిలుచుకునేంత చనువు ఉన్నవారని చాలా మందికి తెలుసు. కానీ.. ఇటీవలి శాసనసభ ఎన్నికల నేపథ్యంలో అందోల్ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ అయిన బాబూ మోహన్ ను కాదని.. సీనియర్ విలేకరికి అవకాశం ఇచ్చారు కేసీఆర్. ఆ సమయంలో మనసును తీవ్రంగా నొచ్చుకున్న బాబూ మోహన్ ఓ సందర్భంలో కన్నీరు పెట్టుకున్నారు కూడా.

 

ఇప్పుడు అనుకోకుండా వచ్చిన మరో సందర్భాన్ని మరో అవకాశంగా తీసుకున్నారు బాబూ మోహన్. దిశ హత్యాచారం ఉదంతంపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్.. మా.. ఆధ్వర్యంలో ఓ నిరసన జరిగింది. ఇండస్ట్రీ పెద్దలతో పాటు.. ఇతర ప్రముఖులూ కార్యక్రమానికి హాజరయ్యారు. వచ్చిన వారిలో తమ్మారెడ్డి భరద్వాజ.. జీవితా రాజశేఖర్, మురళీ మోహన్ తదితరులు ఉన్నారు. వారంతా కేవలం నిందితులు, వారికి శిక్ష కోణంలో మాత్రమే మాట్లాడారు. కానీ.. బాబూ మోహన్ ఒక్కరే కాస్త డిఫరెంట్ గా రియాక్ట్ అయ్యారు.

 

దిశ హత్య కేసు విషయంలో ప్రభుత్వ నిద్ర పోతున్నట్టు కనిపిస్తోందని డైరెక్ట్ అటాక్ చేశారు. నిందితుల తల్లిదండ్రులే.. చంపేయండని అంటుంటే.. వాస్తవాలన్నీ స్పష్టంగా బయటికి వస్తే.. ఇంకా ప్రభుత్వానికి జాలి ఎందుకని నిలదీశారు. కనీసం ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇప్పటివరకూ స్పందించలేదని.. బాధితులకు భరోసా కోసమైనా మాట్లాడాల్సి ఉందంటూ నేరుగా టార్గెట్ చేశారు. దోషుల గుండెల్లో దడ పుట్టేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉండాలని హితవు పలికారు.

 

ఇదంతా చూస్తుంటే.. అదును చూసుకుని మరీ.. కేసీఆర్ పై బాబూమోహన్ పగ తీర్చుకున్నట్టు కనిపిస్తోందని పలువురు అంటున్నారు. మరి.. కేసీఆర్ ఈ మాటలకు స్పందించి దిశ కేసు వ్యవహారంలో ఏమైనా మాట్లాడతారా.. లేదంటే తన అనుయాయులతో కౌంటర్ ఇప్పిస్తారా.. కాదంటే ఎందుకొచ్చిన ఇబ్బందిలే అనుకుని సైలెంట్ గా తన పని తాను చేసుకుని పోతారా అన్నది ఆసక్తిగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: