ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు పూర్తి చేసుకుంది. ఎన్నికలకు రెండు సంవత్సరాల ముందు నుండి జగన్ నవరత్నాల గురించి ప్రచారం చేసి 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఘనవిజయం సాధించారు. ఇప్పటికే నవరత్నాలలోని చాలా పథకాలు అమలవుతున్నాయి. మరికొన్ని పథకాలు ఎప్పటినుండి అమలవుతాయో ఆ డేట్లను ప్రభుత్వం ప్రకటించింది.
 
మరోవైపు ప్రభుత్వం రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు, ఇతర కార్డుల కొరకు గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా అర్హులను ఎంపిక చేసే ప్రక్రియ ఇప్పటికే మొదలుపెట్టింది. గత రెండు రోజుల నుండి కరెంటు బిల్లు 400 రూపాయలు దాటితే వైట్ రేషన్ కార్డును తొలగిస్తారని వైట్ రేషన్ కార్డును తొలగిస్తే ప్రజలు నవరత్నాలలోని చాలా పథకాలకు అర్హులు కాదని వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వం నిజంగా ఈ నిర్ణయాన్ని అమలు చేస్తే లబ్ధిదారుల సంఖ్య భారీగా తగ్గటం ఖాయం. 
 
ఈ మధ్య కాలంలో ప్రతి ఇంట్లో టీవీ, ఏసీ, వాషింగ్ మెషీన్, ఫ్రిడ్జ్ ఉంటున్నాయి. కరెంట్ బిల్లు 400 రూపాయల కంటే ఎక్కువ వచ్చే ఎన్నో కుటుంబాలు ఏపీలో ఉన్నాయి. ఉక్కబోతను తట్టుకోలేక అప్పు చేసి మరీ ఏసీని పెట్టుకునే వారు ఎంతోమంది ఉంటారు. మరి వైరల్ అవుతున్న ఈ వార్తలు నిజమేనా...? అంటే నిజం కాదని చెప్పాలి. వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే రేషన్ కార్డు, ఆరోగ్య శ్రీ కార్డు, ఇతర కార్డులకు నిబంధనలను ప్రకటించింది. 
 
ఆ నిబంధనల ప్రకారం అర్హత కలిగిన కుటుంబాల ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. ప్రభుత్వం కానీ, వైసీపీ నాయకులు కానీ ప్రభుత్వ పథకాలకు కరెంట్ బిల్ ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తామని ఎక్కడా చెప్పలేదు. అధికారికంగా ప్రభుత్వ వర్గాల నుండి కరెంట్ బిల్ ప్రాతిపదికన నవ రత్నాలకు ఎంపిక చేస్తారని కూడా వార్తలు రాలేదు. అందువలన వైరల్ అవుతున్న ఈ న్యూస్ నిజం కాదని తెలుస్తోంది. ప్రజలు కరెంట్ బిల్లు 400 రూపాయలు దాటినా ప్రభుత్వ పథకాలకు దూరమవుతారని భయపడాల్సిన, ఆందోళన చెందాల్సిన అవసరం ఏ మాత్రం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: