ప్రస్తుతం నగరంలో 144 సెక్షన్ అమలవుతుంది. ఈ ఆంక్షలు గురువారం రాత్రి నుండి అంటే డిసెంబరు 5 వ తారీఖు నుంచి శనివారం 7వ తారీఖు ఉదయం 7 గంటల వరకూ అమల్లో ఉంటాయని కమిషనర్ స్పష్టం చేశారు. ఈ ఆంక్షలు ఎందుకు పెట్టారంటే అయోధ్యలో బాబ్రీ మసీదును 1992 డిసెంబరు 6న  కూల్చి వేశారు. ఇకపోతే ఎన్నో ఏళ్ల పాటు మసీదు ఉన్న ఆ ప్రదేశం రామ జన్మ భూమి అని వివాదం నడిచింది.  

 

 

ఈ వ్యవహారం ఇన్నాళ్లూ కోర్టులో ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల బాబ్రీ మసీదు-రామ జన్మ భూమి వ్యవహారంలో సుప్రీం కోర్టు చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. వివాదానికి కేంద్ర బిందువైన 2.77 ఎకరాల భూమిని పూర్తిగా హిందువులకు కేటాయిస్తూ తీర్పు వెలువరించింది. అంతేకాక, అయోధ్యలో మసీదు నిర్మాణానికి 5 ఎకరాల స్థలం కేటాయించాలని కేంద్రాన్ని ధర్మాసనం ఆదేశించింది.

 

 

ఇక తీర్పు వెలువడిన నాటి నుంచి దేశమంతా ఎలాంటి మత ఘర్షణలు జరగకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నాయి. కాని ఈ రోజు బ్లాక్ డే ఈ సందర్భంగా నగరంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఈ మేరకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు.  కొన్ని వర్గాల వారు బ్లాక్ సందర్భంగా హైదరాబాద్‌లో శాంతికి విఘాతం కలిగించేలా మత ఘర్షణలకు తెరతీసే అవకాశం ఉన్నట్లు తమకు సమాచారం అందిందని, అందుకే ఈ రోజు నగరమంతా పటిష్ఠమైన ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.

 

 

మత ఘర్షణలకు తావు కల్పించే ఏ చర్యనూ శుక్రవారం అనుమతించబోమని స్పష్టం చేశారు. హైదరాబాద్ నగర పరిధిలో బైక్ ర్యాలీలు సహా, ధర్నాలు, నిరసనలు, బహిరంగ సమావేశాలు, ప్రసంగాలు, ప్లకార్డులు ప్రదర్శించడం వంటి పనులను ఈ రోజు పూర్తిగా నిషేధిస్తున్నట్లు వివరించారు. వీటిని ధిక్కరిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇదే కాకుండా పోలీసులతో పాటు, మిలిటరీ సిబ్బంది, హోంగార్డులు తదితర భద్రతా బలగాలు డ్యూటీలో ఉండనున్నట్లు వివరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, కల్లోలాలు జరగకుండా వీరు అదుపు చేస్తారని పేర్కొన్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: