మృగాళ్ల చేతిలో ప్రాణాలు కోల్పోయిన పశువైద్యురాలు దిశకు న్యాయం జరగాలంటూ దేశ వ్యాప్తంగా నినాదాలు, నిర‌శ‌న‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే మ‌రోవైపు దిశ కేసులో కొత్త కొత్త నిజాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. మనిషి రూపంలో ఉన్న నలుగురు రాక్షసులు దిశపై ముందు అత్యాచారం చేసి ఆ తరువాత చంపేసి దిశకు నిప్పంటించారని వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. దిశ బతికుండగానే ఆమెకు నిప్పంటించారని తెలుస్తోంది. దిశను సజీవ దహనం చేసినట్లు తాజాగా వెల్లడైంది. చర్లపల్లి జైల్లో ఉన్న నలుగురు నిందితుల్లో ఒకడైన ఆరీఫ్ ఈ మేరకు పోలీసు అధికారులకు చెప్పాడు.

 

అయితే ఇంత జరిగినా ఇప్పటికీ ఆరిఫ్‌లో పశ్చాత్తాపం కానీ, పాపభీతి కానీ లేకపోవడాన్ని చూసి జైలు సిబ్బందే ఆశ్చర్యపోయారు. ఇదిలా ఉంటే దిశ గురించి ఓ అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ కొన్ని విష‌యాలు బ‌య‌ట పెట్టారు. వెటర్నరీ కళశాలలో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ వెటర్నరీ సైన్స్‌ (బీవీఎస్సీ) చదువుకున్న దిశ క్రమశిక్షణ కలిగిన అమ్మాయి అని ఓ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ తెలిపారు. దిశ కళాశాలలో చదువుకున్న రోజులను ఆమె చదువు పట్ల, తోటి విద్యార్థుల పట్ల చనువుగా, రిజర్వుగా ఉన్న రోజులను గుర్తు చేసుకుంటూ ఆయన కంటతడి పెట్టారు. ఆమె కళాశాలలో చదివిన కాలంలో చిన్న ఫిర్యాదు కూడా లేదన్నారు. దిశ మానవ మృగాల చేతిలో బలైపోయిందని వాపోయారు.

 

ఇలాంటి సంఘటనలు జరుగకుండా ఉండాలంటే చట్టాలను మార్చి కఠిన శిక్షలు పడేటట్లు చూడాలన్నారు. అయితే ఇక తాజాగా చర్లపల్లి జైలు నుంచి నిందితులను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం షాద్‌నగర్ తీసుకెళ్లారు. ఆ సమయంలో నిందితులు తప్పించుకునే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు ఎన్‌కౌంటర్ చేసినట్టు సమాచారం. పోలీసుల కళ్లుగప్పి పారిపోయేందుకు నిందితులు ప్రయత్నించారు. దీంతో పోలీసులు కాల్పులు జరపగా ప్రధాన నిందితుడు అరిఫ్, శివ, నవీన్, చెన్నకేశవులు మృతి చెందారు. దిశను సజీవ దహనం చేసిన ప్రాంతంలోనే ఎన్‌కౌంటర్ జరగడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: