ఆడపిల్లలకు అన్యాయం జరిగిందని తెలిస్తే స్పందించే విషయంలో ఇద్దరిదీ ఒకటే స్టైల్.  అప్పట్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఇపుడు కెసియార్. దిశ హత్యాచారం ఘటనలో నలుగురు నిందితులు ఎన్ కౌంటర్ జరిగిన తర్వాత సోషల్ మీడియా, మీడియాలో పోలీసులపై విపరీతమైన ప్రశంసల వర్షం కురుస్తోంది. పనిలో పనిగా ముఖ్యమంత్రి కెసియార్, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ను కూడా ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

 

2008లో వరంగల్లో ఇద్దరు యువతులపై  యాసిడ్ దాడి జరిగింది.  వరంగల్ లోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న స్వప్నిక, ప్రణీత లపై ముగ్గురు కామాంధులు యాసిడ్ దాడి చేశారు.  ఆ దాడిలో యువతులు ఇద్దరు నరకయాతన అనుభవించారో అందరికీ తెలిసిందే. యాసిడ్ దాడిపై అప్పట్లో కూడా యావత్ రాష్ట్రం భగ్గున మండిపోయింది. పోలీసు ఉన్నతాధికారులందరూ వైఎస్సార్ తో సమావేశమయ్యారు.

 

దాడి జరిగిన మూడు రోజులకు ముగ్గురు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. వెంటనే అప్పట్లో ఎస్పీగా ఉన్న ఇదే విసి సజ్జనార్ వెంటనే ఆ విషయాన్ని వైఎస్సార్ కు చెప్పారు. వైఎస్ ఏమి చెప్పారో ఇప్పటికీ బయటకు తెలీదు కానీ వెంటనే ముగ్గురు ఎన్ కౌంటర్ అయిపోయారు. ఎన్ కౌంటర్ దెబ్బకు వైఎస్సార్ పై ఇప్పట్లాగే విపరీమైన ప్రశంసల వర్షం కురిసింది.

 

వరంగల్ ఎన్ కౌంటర్ ఘటన జరిగిన పదేళ్ళకు మళ్ళీ అలాంటి ఎన్ కౌంటరే జరగటం యాధృచ్చికమేమో.  అప్పుడు ముగ్గురు ఎన్ కౌంటర్ అయితే ఇపుడు నలుగురు ఎన్ కౌంటర్ అయ్యారు. అప్పుడు ఎన్ కౌంటర్ జరిగిందీ డిసెంబర్ నెలలోనే. ఇపుడు జరిగింది డిసెంబర్ నెలలోనే.

 

అప్పటి ఎన్ కౌంటర్ కు నేతృత్వం వహించింది ఇప్పటి ఎన్ కౌంటర్ జరిగింది కూడా విసి సజ్జనార్ ఆధ్వర్యంలోనే కావటం విచిత్రం కాకపోతే  మరేమిటి ? నిజానికి ఎన్ కౌంటర్ విషయంలో నిర్ణయాలు తీసుకోవాలంటే పాలకులకు ధైర్యం కావాలి. అప్పుడు వైఎస్సార్, ఇపుడు కెసియార్ ఇద్దరూ తాము ధైర్యవంతులమని నిరూపించుకున్నారు.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: