ఈరోజు ఉదయం షాద్ నగర్ సమీపంలోని చటాన్ పల్లి బ్రిడ్జి దగ్గర దిశ హత్య కేసు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. దిశ ఎక్కడైతే మరణించిందో అదే ప్రదేశంలో నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. పోలీసులు నిందితులు తమపై రాళ్లు రువ్వారని తమ దగ్గర నుండి ఆయుధాలను లాక్కునే ప్రయత్నం చేశారని ఆత్మ రక్షణ కొరకు ఎన్ కౌంటర్ చేయాల్సి వచ్చిందని చెబుతున్నారు. 
 
నిందితుల తల్లిదండ్రులు మాత్రం పోలీసులు కావాలనే తమ బిడ్డలను హతమార్చారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కొడుకును పోలీసులు కావాలనే చంపేశారని నిందితుల తల్లిదండ్రులు ఆరోపణలు చేశారు. కావాలనే చంపేశామనే విషయాన్ని దాచిపెడుతూ ఎన్ కౌంటర్ చేశామని పోలీసులు చెబుతున్నారని చెన్నకేశవులు తల్లి, మహ్మద్ అరీఫ్ తల్లి కన్నీటిపర్యంతం అయ్యారు. పోలీసులు అన్యాయంగా చంపేస్తే న్యాయం ఎక్కడని వారు ప్రశ్నించారు. 
 
నిందితులను శిక్షించటానికి కోర్టులు ఉన్నాయని దిశకు జరిగిన అన్యాయానికి తమకు కూడా బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుల తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడుతూ తమ బిడ్డలను కాపాడుకోవాలని ఎప్పుడూ అనుకోలేదని చెప్పారు. చట్టపరంగా శిక్షలు విధించడం సమంజసం అని నిందితుల తల్లిదండ్రులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా నిందితుల ఎన్ కౌంటర్ పట్ల హర్షం వ్యక్తం అవుతోంది. 
 
దిశ నిందితుల ఎన్ కౌంటర్ సమాజానికి ఒక మంచి ఉదాహరణ అని ప్రజల నుండి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రేపిస్టులకు ఇకముందు ఎన్ కౌంటర్ లో చనిపోతామేమో అనే భయం ఉంటుందని మహిళా హక్కుల కార్యకర్త తృప్తి దేశాయ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్ నేపథ్యంలో ఘటన జరిగిన ప్రాంతానికి జనాలు భారీగా తరలివస్తున్నారు. ఆడపిల్లలపై అనుచితంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని మరోసారి రుజువైందని ప్రజలు చెబుతున్నారు. ప్రజలు తెలంగాణ పోలీస్ జిందాబాద్... సాహో సజ్జనార్ అంటూ నినదిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: