గత నెల 27న హైదరాబాద్ శివార్లలో దారుణ హత్యాచారానికి గురైన శంషాబాద్ వెటర్నరీ డాక్టర్ హత్యాచారం దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. అయితే నేడు తెల్ల‌వారుజామున దిశ హత్య కేసులో నలుగురు నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసిన విషయం తెలిసిందే. సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా తప్పించుకునేందుకు ప్రయత్నించిన నిందితులు.. పోలీసులపై రాళ్లు రువ్వుతూ పరుగులు తీస్తుండగా వారిపై ఖాకీలు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నిందితులు ఆరిఫ్‌, శివ, నవీన్‌, చెన్నకేశవులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై సామాన్యుడి నుంచి సెలబ్రిటీ వరకు ప్రతి ఒక్కరూ స్పందిస్తూ పోలీసుల పనితీరును మెచ్చుకుంటున్నారు. 

 

ఇదిలా ఉంటే శంషాబాద్ పరిసరాల్లో కామాంధుల చేతిలో దారుణ హత్యాచారానికి గురైన పశువైద్యురాలి అసలు పేరును ఎవరూ ప్రస్తావించకూడదని, ఇక నుంచి దిషా అనే పేరుతో బాధితురాలిని పిలవాలని సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ ప్రజలకు సూచించిన విష‌యం తెలిసిందే. బాధితురాలికి న్యాయం జరగడం కోసం జస్టిస్‌ ఫర్‌ దిశ పేరుతో పిలవాలని సైబరాబాద్ సీపీ సజ్జనార్‌ సూచించారు. ఈ మేరకు బాధితురాలి కుటుంబ సభ్యులను ఆయన ఒప్పించారు. అయితే నిందితులకు ఎలాంటి శిక్ష పడుతుందో, దిశ తల్లిదండ్రులకు ఎలా న్యాయం చేయాలో, సమాజానికి ఎటువంటి సందేశాన్ని పంపాలో ఆలోచించిన ఆయన, ఓ 'దిశ'ను చూపించాలనే ఈ పేరును ఎంచుకున్నారని అంటున్నారు.

 

వాస్త‌వానికి మహిళలపై అత్యాచారాలు జరిపి, వారిపై అత్యంత క్రూరంగా ప్రవర్తించే వారికి ఎలాంటి శిక్ష విధించాలన్న విషయమై గతంలోనే అనుభవాన్ని కలిగివున్న సజ్జనార్, కావాలనే ఆమె పేరును దిశగా మార్చారని విశ్లేషకులు భావిస్తున్నారు. నిందితులకు అత్యంత కఠినమైన శిక్ష అంటే, వారిని సమాజంలో లేకుండా చేయడమే. అయితే జరగబోయే దాన్ని ముందే ప్లాన్ చేసుకున్న ఆయన, కావాలనే బాధితురాలి పేరును మార్చారని, అత్యాచారాలకు పాల్పడాలని భావించే వారికి తమ భవిష్యత్తు ఏ 'దిశ'గా వెళుతుందో ఉదాహరణతో సహా చూపించేందుకే ఈ పని చేశారని అంటున్నారు విశ్లేష‌కులు. ఏదేమైనా దిశపై హత్యాచారం కేసులో నిందితులను ఎన్ కౌంటర్ చేయడంతో సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ ను సోషల్ మీడియాలో 'హీరో'గా పేర్కొంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: