ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు నారాయణ అనారోగ్యంతో మృతి చెందారు. వ్యక్తిగత సహాయకుడి మృతి గురించి తెలిసిన వెంటనే సీఎం జగన్ తన ఢిల్లీ పర్యటనను అర్ధాంతరంగా ముగించుకున్నారు. ఈరోజు ఉదయం ఢిల్లీ నుండి బయలుదేరిన సీఎం జగన్ ఢిల్లీ నుండి నేరుగా కడప విమానాశ్రయానికి చేరుకోనున్నారు. కడప విమనాశ్రయం నుండి నారాయణ స్వగ్రామానికి సీఎం వెళ్లనున్నారు. 
 
మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో సీఎం జగన్ అనంతపురం జిల్లా దిగువపల్లెకు చేరుకుంటారు. ఆ తరువాత ముఖ్యమంత్రి నారాయణ కుటుంబసభ్యులను పరామర్శించి సాయంత్రం తాడేపల్లికి చేరుకుంటారు. దాదాపు 30 సంవత్సరాలకు పైగా నారాయణకు వైయస్సార్ కుటుంబంతో అనుబంధం ఉందని తెలుస్తోంది. గత కొంతకాలంగా నారాయణ తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. 
 
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నారాయణ తుదిశ్వాస విడిచారు. ఈరోజు మధ్యాహ్నం సీఎం జగన్ అమిత్ షా, మోదీలతో సమావేశం కావాల్సి ఉన్నా వ్యక్తిగత సహాయకుడు మృతి చెందటంతో సమావేశం రద్దయింది. సీఎం జగన్ కు నారాయణతో ఉన్న అనుబంధం ఎక్కువని సమాచారం. నారాయణను కడసారి చూసేందుకు జగన్ హుటాహుటిన అనంతపురం బయలుదేరారు. నిన్న ఉదయం సీఎం జగన్ కియా పరిశ్రమను ప్రారంభించారు. 
 
మోదీ, అమిత్ షా అపాయింట్ మెంట్లు ఖరారు కావడంతో హుటాహుటిన సీఎం జగన్ ఢిల్లీకి బయలుదేరగా కొన్ని కారణాల వలన నిన్న మోదీ, అమిత్ షాలతో సమావేశం జరగలేదు. జగన్ నారాయణను తమ కుటుంబ సభ్యునిలా భావిస్తారని సమాచారం. నారాయణ మృతి గురించి తెలిసిన వెంటనే జగన్ తీవ్ర భావోద్వేగానికి లోనయినట్లు సమాచారం. జగన్ కు ఈ మధ్య కాలంలో ఢిల్లీ పర్యటనలు కలిసి రావడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. మరికొన్ని రోజుల్లో జగన్ మోదీ, అమిత్ షాలతో భేటీ అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఏపీకి రావాల్సిన నిధుల కొరకు, అమ్మఒడి పథకానికి మోదీని ఆహ్వానించటానికి జగన్ ఢిల్లీ వెళ్లినట్లు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: