దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన దిశ హత్యోదంతం భారతీయుల హృదయాలను ద్రవింపజేసింది. నిందితులకు ఉరి శిక్ష వేయాలని అందరూ ముక్త కంఠంతో నినదించారు. అనూహ్య పరిణామాల మధ్య సీన్ రీ కన్ స్ట్రక్షన్ జరుగుతున్న సమయంలో నిందితుల నుంచి ప్రతిఘటన ఎదురైంది. దీంతో పోలీసులు నలుగురు  నిందితులను ఈరోజు ఉదయం ఎన్ కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. కేసు తీవ్రత దృష్ట్యా పోలీసులు అత్యంత భద్రత పాటిస్తున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాలను తరలించే బదులు ఇక్కడే నిర్వహించాలని నిర్ణయించారు.

 

 

వీరి మృతదేహాలకు ఘటనా స్థలంలోనే పంచనామా చేసేందుకు నిర్ణయించారు పోలీసులు. శంషాబాద్ మండలం చటాన్‌పల్లి వద్దే ఇందుకు తగిన ఏర్పాట్లు చేశారు. దీని నిమిత్తం గాంధీ ఆస్పత్రి నుంచి వచ్చిన డాక్టర్లు నిందితులు ఆరిఫ్ పాషా, జొల్లు శివ, నవీన్, చెన్నకేశవులు మృతదేహాలకు పంచనామా నిర్వహిస్తున్నారు. రెవెన్యూ అధికారుల సమక్షంలో పోలీసులు పంచనామా నిర్వహిస్తున్నారు. పంచనామా అనంతరం నలుగురు నిందితుల మృతదేహాలను మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తారు. ఐదుగురు ఫోరెన్సిక్ నిపుణుల ఆధ్వర్యంలో శవాలకు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. ఇప్పటికే అక్కడికి రెవెన్యూ అధికారులు చేరుకున్నారు. పోస్ట్ మార్టం నేపథ్యంలో ఆ ప్రాంతంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు.

 

 

మరోవైపు దీనిపై నిందితుల కుటుంబసభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఘటనపై తమకూ బాధ ఉందని.. కానీ నిందితులను శిక్షించే పద్ధతి ఇది కాదని అన్నారు. ఏమాత్రం సమాచారం ఇవ్వలేదని అన్నారు. దిశ  హత్యకేసులో నిందితుల ఎన్‍కౌంటర్‍పై జాతీయ మానవ హక్కుల సంఘం నోటీసులు జారీ చేసింది. తెలంగాణ పోలీసులకు ఈమేర నోటీసులు ఇచ్చారు. ఘటనపై జాతీయ మానవ హక్కులకు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఎంత ఆందోళనలు వ్యక్తమయ్యాయో.. పోలీసుల తీరుపై అంతే హర్షం వ్యక్తమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: