దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ నిందితుల ఎన్ కౌంటర్ తీవ్ర చర్చనీయాంశమైంది. నలుగురు నిందితులు తప్పించుకునే క్రమంలో పోలీసులపై దాడి చేశారని.. గత్యంతరం లేని పరిస్థితుల్లో నిందితులపై కాల్పులు జరిపామని సీపీ సజ్జనార్ తెలిపారు. దీనిపై సైబరాబాద్ సీపీ సజ్జనార్ విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు తెలియజేసారు. కిక్కిరిసిన విలేకరుల సమావేశంలో సీపీ ఈ సంఘటన వివరాలు తెలిపారు.

 

 

'దిశను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసి ఆపై హత్య చేశారు. అనేక కోణాల్లో ఇన్వెస్టిగేషన్ చేశాం. మహ్మద్ ఆరిఫ్, శివ, నవీన్, చెన్నకేశవులను ఈకేసులో అరెస్ట్ చేశాం. నవంబర్ 30న నిందితుల్ని చర్లపల్లి జైలుకు తరలించాం. నిందితుల్ని జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్నాం. కస్టడీలోకి తీసుకున్న తర్వాత వారిని అనేక కోణాల్లో ప్రశ్నించాం. కొన్ని వస్తువులు రికవరీ కోసం ఘటనా స్థలానికి నిందితుల్ని తీసుకొచ్చాం. సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేస్తుండగా.. నిందితులు పోలీసులపై దాడి చేశారు. వారిలో మహ్మద్ అరిఫ్, చెన్న కేశవులు పోలీసుల నుంచి వెపన్స్ తీసుకుని పోలీసులపై కాల్పులకు ప్రయత్నించారు. రాళ్లతో, కర్రలతో కూడా వారు దాడికి దిగారు. ఈ దాడిలో ఎస్సై, కానిస్టేబుల్ గాయపడ్డారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో నిందితులు నలుగురు మృతి చెందారు'. 

 

 

'ఈరోజు ఉదయం 5.45 నుంచి 6.15 మధ్యలో ఎన్‍కౌంటర్ జరిగింది. మొదట మహ్మద్ ఆరిఫ్ తర్వాత చెన్నకేశవులు పోలీసులపై దాడి చేశారు. నిందితుల దగ్గరనుంచి రెండు వెపన్స్ ను సీజ్ చేశాం. నిందితులంతా పాతికేళ్లకు అటుఇటుగా ఉన్నవారే. ఇతర రాష్ట్రాల్లో కూడా నిందితులు నేరాలు చేసినట్టు అనుమానాలున్నాయి. ఆయా రాష్ట్రాల్లో మిస్సింగ్ కేసులు పరిశీలించి దర్యాప్తు చేస్తాం. చట్టం తన పని తాను చేసుకుపోతుంది' అని సీపీ సజ్జనార్ తెలిపారు. ఈ సమావేశాన్ని జాతీయ స్థాయి మీడియా మొత్తం కవర్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: