సంచలనం సృష్టించిన దిశ హత్యాచార ఘటనలో నిందితులను పోలీసులు ఈరోజు ఎన్ కౌంటర్ చేశారు.  ఈ ఘటనపై దేశవ్యాప్తంగా రాజకీయ నేతలు, ప్రముఖులు, సినిమా సెలబ్రిటీల నుంచి పోలీసుల చర్యపై హర్షం వ్యక్తమవుతోంది. దిశకు న్యాయం జరిగిందని.. నిందితులకు సరైన శిక్ష పడిందని తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు. తమ అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. ఇటువంటి ఘటనలపై ఉక్కుపాదం మోపే విధంగా తెలంగాణ పోలీసులు చర్యలు తీసుకున్నారని ప్రశంసిస్తున్నారు. ఈ ఘటనపై ఏపీ మంత్రులు, ముఖ్య నేతలు కూడా స్పందించారు.

 

 

ఆంధ్రప్రదేశ్ స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు ఇదే అసలైన దీపావళి అని వ్యాఖ్యానించారు. దిశ హత్యాచరా నిందితులు ఎట్టకేలకు ఎన్‌కౌంటర్‌లో చనిపోయారని.. చనిపోయిన దిశను తీసుకురాలేకపోయినా బాధితురాలి తల్లిదండ్రులకు కాస్తైనా ఊరట లభించిందని అభిప్రాయపడ్డారు. దిశ కేసులో లాయర్లు కూడా నిందితుల తరపున వాదించడానికి ముందుకు రాకపోవడం హర్షణీయమన్నారు. ఇకపై ఎవరైనా ఆడవాళ్ల జోలికి వెళ్లాలంటేనే భయపడేలా తెలంగాణ పోలీసుల చర్య ఉందని అన్నారు. దిశ కేసు నిందితులకు సరైన శిక్ష పడిందన్నారు. 2012లో నిర్భయ ఘటన తర్వాత పోక్సో చట్టం ప్రవేశపెట్టినా.. అది సరిగా అమలు కాకపోవడంతో ఇలాంటి ఘటనలు ఇంకా జరుగుతున్నాయని అన్నారు. నిర్భయ కేసులో నిందితులు ఇంకా జైల్లోనే ఉన్నారని.. ఇలాంటి నిందితులకు మరణశిక్షే సరైనదనే భావన ప్రజల్లో ఉందని.. దీనిని దేశం మొత్తం ముక్తకంఠంతో నినదిస్తోందన్నారు.

 



మరోవైపు.. ఏపీలోనూ ఇటువంటి ఘటనలు ఎక్కడా జరగకుండా చూసేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని మంత్రి తానేటి వనిత తెలిపారు. మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జీరో ఎఫ్‌ఐఆర్ విధానంతో మహిళల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని ఈ సందర్భంగా వనిత అన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: