రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసులో నిందితుల చేతితో దారుణంగా హత్యకు గురైన దిశ ఉసురు నిందితుల కుటుంబ సభ్యులకు తగిలింది. పోలీసుల చేతిలో కుక్క చావు చచ్చిన నిందితుల గురించి వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. దేశవ్యాప్తంగా నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేయటంపై హర్షం వ్యక్తం అవుతూ ఉండగా వారి చావుతో మాకు దిక్కేది అంటూ నిందితుల కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు.
 
నిందితులలో ఒకరైన చెన్నకేశవులు భార్య రేణుక భర్తను ఎన్ కౌంటర్ చేశారనే విషయం తెలిసిన వెంటనే కన్నీటి పర్యంతమయింది. పెళ్లై ఏడాది కూడా కాలేదని చిన్న వయస్సులోనే పెళ్లి చేసుకున్నానని రేణుక మీడియాతో చెబుతోంది. రేణుక ప్రస్తుతం గర్భవతి అని సమాచారం. మా ఆయనను ఎక్కడ చంపారో నన్ను కూడా అక్కడే చంపాలని రేణుక కోరింది. మా ఆయన లేకుండా నేను మాత్రం బతకను అని రేణుక చెబుతోంది. 
 
మా ఆయనను ఎక్కడికి తీసుకెళ్లి చంపారో నన్ను కూడా అలానే తీసుకెళ్లి చంపేయండి అని కన్నీళ్లు పెట్టుకుంది. తన భర్తను తీసుకెళ్లిన వాళ్లను, అతడిని ఎన్ కౌంటర్ చేసిన వాళ్లను చంపాలని రేణుక కోరింది. చనిపోయిన నలుగురు నిందితుల కుటుంబాలలో ఒక్కొక్కరు కొడుకులు కావటం గమనార్హం. గ్రామస్తులు నేరుగా స్మశానానికి తరలించి అంత్యక్రియలు చేసేందుకు అంగీకరించారు. 
 
పోలీసులు అంత్యక్రియల నేపథ్యంలో గుడిగండ్ల, జక్లేర్ గ్రామాల్లో భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. నేరం చేసింది చెన్నకేశవులే అయినప్పటికీ జీవితాంతం అతని భార్య రేణుక శిక్ష అనుభవించాల్సి వస్తోంది. మరో నిందితుడు శివ తల్లి ఇంతకంటే నేరాలు ఘోరాలు చేసిన వారు ఉన్నారని వారిని ఇలాగే చంపారా...? అని ప్రశ్నిస్తున్నారు. ఇలా ఎన్ కౌంటర్ చేసి చంపేయటం ఎంతవరకూ కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు. పోలీసుల ఎన్ కౌంటర్ ను మెజారిటీ శాతం సమర్థిస్తుండగా కొంతమంది మాత్రం వ్యతిరేకిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: