నెల్లూరు జిల్లాలో చంద్రబాబునాయుడుకు పెద్ద షాక్ తగిలింది. సీనియర్ నేత, చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన బీద మస్తాన్ రావు టిడిపికి రాజీనామా చేశారు. వైసిపిలో చేరటానికి రంగం రెడీ అయ్యిందని సమాచారం. కావలి నుండి బీద మస్తాన్ రావు 2014లో గెలిచారు. రాజధాని కోసం చంద్రబాబు నియమించిన కమిటిలో బీద కూడా సభ్యుడే. జిల్లాలోనే కాకుండా మొత్తం పార్టీలోనే చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన అతికొద్దిమంది నేతల్లో బీద కూడా ఒకరు.

 

అటువంటి బీద మొన్నటి ఎన్నికల్లో నెల్లూరు ఎంపిగా పోటి చేసి ఓడిపోయారు. అప్పటి నుండి పార్టీ కార్యక్రమాల్లో పెద్ద చురుగ్గా లేరనే చెప్పాలి. అయితే కొంత కాలంగా వైసిపి నేతలతో సన్నిహితంగా ఉంటున్నారు. నెల్లూరు జిల్లాలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు బాగా సన్నిహితుడని చెబుతున్నారు.

 

ఇద్దరు కూడా యాదవ సామాజికవర్గానికి చెందిన నేతలే కావటంతో ఇద్దరికి కావాల్సిన వారు లింక్ కలిపినట్లు ప్రచారంలో ఉంది. అలాగే ఈమధ్య తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో జరిగిన మత్స్యకార దినోత్సవ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. అదే సమావేశంలో బీద మస్తాన్ రావు కూడా పాల్గొన్నారు. దాంతోనే బీద పార్టీ మారబోతున్నారనే ప్రచారం మొదలైంది.

 

జరుగుతున్న ప్రచారాన్ని బీద ఖండించినా ఎవరూ నమ్మలేదు. వెంటనే చంద్రబాబు కూడా బీదకు ఫోన్ చేసి మరీ మాట్లాడారు. అయితే అప్పటికే పార్టీకి రాజీనామా చేయాలని డిసైడ్ చేసుకున్న బీద ఏదో ముక్తసరిగా మాట్లాడినట్లు తెలుస్తోంది.

 

మొత్తానికి ఈ మధ్య కాలంలో జరిగిన రాజకీయ పరిణామాలతో బీద పార్టీకి రాజీనామా చేయాలని డిసైడ్ అయ్యారు. ఈరోజు పార్టీకి రాజీనామా చేస్తు లేఖను చంద్రబాబుకే నేరుగా పంపారు. బీద మస్తాన్ రావు రాజీనామా లేఖతో చంద్రబాబుకు  షాక్ కొట్టినట్లైంది. సామాజికవర్గం పరంగానే కాకుండా ఆర్దికంగా కూడా బీద గట్టి స్ధితిలో ఉన్నారు. టిడిపి హయాంలోనే బీద పరిశ్రమలు, వ్యాపారాలపై నెల్లూరు, చెన్నై కార్యాలయాల్లో ఐటి దాడులు జరిగాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: