తన భర్త లేకుండా బతకలేనని, తాను కూడా చనిపోతానని దిశ హత్యకేసులో నిందితుడు చెన్నకేశవులు భార్య రేణుక కన్నీటి పర్యంతమయింది. తన భర్తను పోలీసులు ఎన్‌ కౌంటర్‌ చేశారని తెలియగానే ఆమె హతాశురాలైంది. తన భర్తను తిరిగి పంపిస్తామని తీసుకెళ్లిన పోలీసులు తనను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. చిన్న వయసులో పెళ్లి చేసుకున్నానని, తమ పెళ్లి జరిగి ఏడాది కూడా పూర్తి కాలేదని మీడియా ముందు గోడు వెళ్లబోసుకుంది.

 

దిశ నిందితుల బంధువులు ఆందోళనకు దిగారు. మక్తల్ రోడ్డు పై బైఠాయించారు. ఎన్‌ కౌంటర్‌ చేసిన తమవారి మృతదేహాలను అప్పగించాలని డిమాండ్ చేశారు. డబ్బున్న వారికో న్యాయం..? తమకో న్యాయమా..? అని చెన్నకేశవులు బంధువులు ప్రశ్నిస్తున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే కొడుకులనూ ఇలాగే చంపుతారా..? అని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నారు. తన భర్త మృతదేహాన్ని తనకు అప్పగించాలని, లేకపోతే తనను కూడా పూడ్చేయాలని చెన్నకేశవులు భార్య రోదిస్తోంది.

 

తాను, చెన్నకేశవులు ఏడు నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నామని, ప్రస్తుతం ఆమె గర్భవతినని తెలిపింది. భర్త ఎన్‌ కౌంటర్ వార్త తెలిసినప్పటి నుంచి ఆమె కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. తనకు దిక్కెవరని ప్రశ్నిస్తోంది. అత్యాచారాలు చేసినవాళ్లు చాలామంది ఉన్నారని, వాళ్లను జైళ్లలో కుక్కల్లా మేపుతున్నారని ఆరోపించింది. తన భర్త కూడా కొంతకాలానికి తిరిగి వస్తారని అనుకున్నానని చెప్పింది.

 

ఎన్‌ కౌంటర్‌లో చనిపోయిన నలుగురు నిందితులు తమ కుటుంబంలో ఒక్కొక్కరే కొడుకులు కావడం గమనార్హం. శుక్రవారం రాత్రి నారాయపేట జిల్లాలో మక్తల్‌ మండలం జక్లేర్‌, గుడిగండ్ల గ్రామాల్లో నలుగురి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. నేరుగా శ్మశానానికి తరలించి అంత్యక్రియలు చేసేందుకు గ్రామస్తులు అంగీకరించారు. తమ పొలంలో అంత్యక్రియలు చేయనున్నట్టు చెన్నకేశవులు కుటుంబ సభ్యులు తెలిపారు. మరోవైపు జక్లేర్‌, గుడిగండ్ల గ్రామాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: