సాహో సజ్జనార్, జై పోలీస్ జై జై పోలీస్, పోలీస్ జిందాబాద్ ఇలా నిన్న తెలుగు రాష్ట్రాల ప్రజలు పోలీసులపై ప్రశంసలు కురిపిస్తూ పూల వర్షం కురిపించారు. కేవలం తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు దేశ వ్యాప్తంగా తెలంగాణ పోలీసులను అభినందనలతో ముంచెత్తారు ప్రజలు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్య కేసును నిందితుల ఎన్‌కౌంటర్‌తో ఫులుస్టాప్ పెట్టారు పోలీసులు. జాతీయ మీడియా సైతం తెలంగాణ పోలీసులను ప్రశంసించింది, దిశకు న్యాయం జరిగిందంటూ కథనాలు వెలువరించింది.

 

ఇక దిశ హత్య కేసును దర్యాప్తు చేస్తున్న దగ్గర నుంచి పోలీసుల మీద తీవ్రమైన ఒత్తిడి ఉన్న విషయం తెలిసిందే, ఘటన జరిగినప్పుడు పోలీసులు వెంటనే స్పందించి ఉంటే తమ పాప బ్రతికి ఉండేదని స్వయానా దిశ తండ్రి మీడియాతో వాపోయారు. ఇక ఈ విషయంపై ప్రజలు, మహిళా సంఘాల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో విధుల్లో అలసత్వం వహించినందుకు గానూ ముగ్గురు పోలీసులను సస్పెండ్ కూడా చేశారు.

 

దిశ హత్య కేసు విచారణ బృందానికి సజ్జనార్ నేతృత్వం వహించారు. నిన్న ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో సీపీ సజ్జనార్ మాట్లాడుతూ "నాకు ఎన్నో మెసేజెస్, ఫోన్లు చేశారు దిశ హత్య కేసు నిందితులపై ఏం చర్యలు తీసుకుంటున్నారని, ఇలా గంట గంటకు, నిమిష నిమిషానికి ఏం పురోగతి ఉంటుంది చెప్పండి మీరే" అంటూ మీడియాను ఉద్దెశించి అన్నారు సజ్జనార్. ఈ నేపథ్యంలోనే సజ్జనార్ ఫోన్ కు సామాన్య ప్రజానీకం సైతం సారు వరంగల్ లో మీరు అప్పట్లో యాసిడ్ దాడికి పాల్పడ్డ నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసి కఠినంగా శిక్షించారు కదా దిశ హత్య కేసు నిందితులను కూడా కఠిన శిక్షించాలని సజ్జనార్ ని మెసేజెస్ ద్వారా వేడుకున్నట్లు సమాచారం. ఇది చాలా సున్నితమైన కేసు నిందితులు చాలా తెలివిగా వ్యవహరించి ఏ ఆధారాలు దొరక్కుండా జాగ్రత్త పడ్డారు అని సీపీ పేర్కొన్నారు. ఇలాంటి కేసు విషయంలో సంయమనం పాటించాలని సూచించారు. దిశ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టొద్దని, వాళ్ళ వ్యక్తిగత స్వేచ్చకు భంగం కలిగించొద్దని విజ్ఞప్తి చేశారు సజ్జనార్.

మరింత సమాచారం తెలుసుకోండి: