రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్య కేసు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. నిందితుల ఎన్ కౌంటర్ గురించి దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతుంటే నిందితుల కుటుంబాలు మాత్రం కన్నీటి పర్యంతమయ్యాయి. మక్తల్ రోడ్డుపై బైఠాయించి చెన్నకేశవులు బంధువులు ఆందోళనకు దిగారు. 
 
చెన్నకేశవులు బంధువులు డబ్బున్న వారికో న్యాయం...? తమకో న్యాయమా...? అని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని సూటిగా ఎంపీ, ఎమ్మెల్యేల కొడుకులను ఇదే విధంగా చంపుతారా...? అని ప్రశ్నించారు. నిందితులలో ఒకరైన చెన్నకేశవులు ఏడు నెలల క్రితం రేణుక అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. రేణుక ప్రస్తుతం గర్భవతి. తన భర్తను ఎన్ కౌంటర్ చేశారని తెలిసినప్పటి నుండి రేణుక తనకు దిక్కెవరని ప్రశ్నిస్తోంది. 
 
చాలామంది అత్యాచారాలు చేసి జైళ్లలో ఉన్నారని వారిని కుక్కల్లా మేపుతున్నారని రేణుక ఆరోపణలు చేసింది. దేశంలో ఇలాంటి కేసులు ఎన్నో జరిగాయని ఒక అమ్మాయి కోసం నలుగురి ప్రాణాలు తీయడం తప్పు అని రేణుక అన్నారు. నిందితులను ఎన్ కౌంటర్ చేయడం న్యాయం కాదని అన్యాయం అని రేణుక చెప్పారు. మా ఆయనను ఎక్కడ ఎన్ కౌంటర్ చేసి చంపారో నన్ను కూడా అక్కడే చంపాలని రేణుక అన్నారు. 
 
మరోవైపు దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై జ్యూడీషియల్ విచారణ జరపాలని, స్వతంత్ర నిపుణులతో మరలా పోస్టుమార్టం నిర్వహించాలని పిటిషన్ దాఖలైంది. హైకోర్టు 9వ తేదీ ఉదయం ఈ పిటిషన్ ను పరిశీలిస్తామని ప్రకటించింది. సోమవారం రాత్రి 8 గంటల వరకు మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించవద్దని మృతుల పోస్టుమార్టం నివేదికను సీడీ లేదా పెన్ డ్రైవ్ రూపంలో అందించాలని కోర్టు ఆదేశించింది. 9వ తేదీ ఉదయం 10.30 గంటలకు ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. జాతీయ మానవ హక్కుల కమిషన్ తాము పరిశీలించిన తరువాతే మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించాలని అంతవరకు అంత్యక్రియలు నిర్వహించొద్దని ఆదేశించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: