దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్య కేసులో నిందితులను నిన్న ఉదయం పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. నిందితులపై పోలీసులు ఎన్ కౌంటర్ చేయటంపై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతూ ఉండగా కొంతమంది మాత్రం విమర్శలు చేస్తున్నారు. తెలంగాణ పోలీసులు నిందితులను ఎన్ కౌంటర్ చేయడం గురించి స్పందిస్తూ పౌర హక్కుల సంఘాల ప్రతినిధులు, న్యాయవాదులు ఎన్ కౌంటర్ చేసిన పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. 
 
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసులకు న్యాయవ్యవస్థ అందుబాటులో ఉందనే విషయాన్ని గుర్తు చేస్తున్నామని, నిందితులను శిక్షించడానికి చట్టాలు ఉన్నాయని న్యాయవాదులు చెబుతున్నారు.సుప్రీం న్యాయవాది వృందా గ్రోవర్ అత్యాచారాలకు పాల్పడేవారికి భయం కలిగేలా వ్యవహరిస్తున్నామని, మహిళలకు భద్రత కల్పిస్తున్నామనే ముసుగులో ఎన్ కౌంటర్లకు దిగడం అమానవీయమని అన్నారు. 
 
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని చూసి మిగతా రాష్ట్రాలు కూడా ఇదే విధంగా ఎన్ కౌంటర్లకు దిగితే పరిస్థితి ఏమవుతుందని వృందా గ్రోవర్ ప్రశ్నించారు. సుప్రీంకోర్టు దేశంలో ఎక్కడైనా ఎన్ కౌంటర్ జరిగితే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని చెబుతోందని అన్నారు. ఎన్ కౌంటర్ చేసిన తెలంగాణ పోలీసులపై వెంటనే కేసు నమోదు చేయాలని వృందా గ్రోవర్ డిమాండ్ చేశారు. ఎన్ కౌంటర్ చేయడం న్యాయ వ్యవస్థకు విరుద్ధమని, అప్రజాస్వామ్య విధానమని వృందా గ్రోవర్ అన్నారు. 
 
మహిళలకు భద్రత కల్పిస్తున్నామనే ముసుగులో పోలీసులు ఎన్ కౌంటర్ చేశారని వృందా గ్రోవర్ అన్నారు. మరోవైపు దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై జాతీయ మానవ హక్కుల సంఘం పోలీసులకు నోటీసులు జారీ చేసింది. ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు జ్యుడీషియల్ విచారణ జరపాలని, స్వతంత్ర నిపుణులతో మరలా పోస్టుమార్టం నిర్వహించాలని పిటిషన్ దాఖలు చేయగా కోర్టు సోమవారం రాత్రి వరకు మృతదేహాలకు అంత్యక్రియలు చేయరాదని 9వ తేదీన ఈ పిటిషన్ ను పరిశీలిస్తామని ప్రకటించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: