ఓవైపు దిశ రేపిస్టుల ఎన్ కౌంటర్ పై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతుంటే.. నిందితుల కుటుంబాల్లో మాత్రం విషాదం నెలకొంది. అందులోనూ చెన్నకేశవులు అనే వ్యక్తి ప్రేమ వివాహం చేసుకోవడంతో అతని భార్య దుఃఖం చెప్పనలవి కాకుండా ఉంది. భర్త శవం తనకు అప్పగించాలంటూ ఆమె ఆందోళన చేసింది. ఆ సమయంలో ఆమె వేసిన కొన్ని ప్రశ్నలు ఆలోచింపజేస్తున్నాయి.

 

 

తన భర్తను ఎన్‌కౌంటర్ చేసిన చోటే తనను చంపేయాలని ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్తను అన్యాయంగా పోలీసులు చంపేశారని రేణుక ఆరోపిస్తోంది. ఈ లోకంలో భర్త ఒక్కడే ఇలాంటి తప్పు చేశాడా.. ఇంకెవరూ చేయలేదా.. ఇలాంటి తప్పు చేసిన అందరినీ ఇలాగే చంపేస్తున్నారా.. అంటూ ఆమె నిలదీసింది. తన భర్తను ఎన్‌కౌంటర్ చేసినట్లుగానే, అత్యాచార కేసుల్లో నిందితులుగా జైళ్లలో ఉన్నవారిని కూడా చంపేయాలని చెన్నకేశవులు భార్య రేణుక డిమాండ్ చేసింది.

 

ఇప్పుడు జనానికి సంతోషంగా ఉందా.. ఎన్‌కౌంటర్ జరిగినందుకు దేశ ప్రజలంతా సంబరాలు చేసుకుంటున్నారు కదా అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. గతంలో ఇలాంటి సంఘటనలు చేసిన నిందితులను కూడా ఇలానే కాల్చేయాలని డిమాండ్ చేస్తోంది. నిందితుల మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించకుండా నేరుగా అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించడాన్ని ఆమె తప్పుబట్టింది. తన భర్త మృతదేహాన్ని తమకు అప్పగిస్తే, పొలం వద్ద అంత్యక్రియలు నిర్వహించుకుంటామని రేణుక కోరింది.

 

ఒక అమ్మాయి కోసం నలుగురిని పొట్టనబెట్టుకున్నారని.. దిశ తన చెల్లెలికి కాకుండా పోలీసులకు ఫోన్ చేసుంటే ఈ ఘోరం జరిగి వుండేది కాదని ఆమె పేర్కొంది. ఈ కేసులో కోర్టు తీర్పు ఇవ్వకముందే పోలీసులు ఇలా చేయడాన్ని రేణుక తప్పుబట్టింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: