కామాంధుల రాక్ష‌స చ‌ర్య‌కు మ‌రో అభాగ్యురాలు క‌న్నుమూసింది. లైంగికదాడి బాధితురాలిపై పెట్రోల్‌ పోసి నిప్పటించిన ఘటనలో యువతి మృతి చెందింది. లక్నోలోని శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను విమానంలో ఢిల్లీలోని సఫ్దర్‌గంజ్‌ ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. ఉన్నావ్‌ బాధితురాలు శుక్రవారం కన్నుమూశారు. 90 శాతం కాలిన గాయాలతో దవాఖానలో చేరిన బాధితురాలు.. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి 11:40 గంటలకు మరణించినట్టు డాక్టర్లు తెలిపారు.

 


కేసు విచారణ నిమిత్తం కోర్టుకు వెళుతున్న బాధితురాలిపై ఐదుగురు వ్యక్తులు అత్యంత పాశవికంగా దాడి చేసి, పెట్రోల్‌ పోసి నిప్పంటించిన విషయం తెలిసిందే. ఆ యువతిపై దాడి జరిగాక...95 శాతం శరీరం కాలినా...అంబులెన్స్‌ కోసం ఆమె ఫోన్‌ చేసిన విషయం విదితమే. ఆ తర్వాత యూపీనుంచి ఢిల్లీకి ఎయిర్‌లిఫ్ట్‌ ద్వారా తరలించారు. ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ దవాఖానలో చికిత్స పొందుతున్న స‌మ‌యంలో ``ఆమె పరిస్థితి విషమంగా ఉన్నది. వెంటిలేటర్‌ అమర్చాం. బతికే అవకాశాలు చాలా తక్కువ' అని కాలినగాయాలు, ప్లాస్టిక్‌ సర్జరీ విభాగం అధిపతి డాక్టర్‌ షలాబ్‌ కుమార్‌ చెప్పిన కొద్దిగంటల్లోనే ఆ యువతి కన్నుమూసింది. జాతీయ మ‌హిళా క‌మిష‌న్ అధ్య‌క్షురాలు రేఖాశ‌ర్మ సంఘ‌ట‌న స్థ‌లానికి చేరుకున్నారు. 

 

కాగా, బాధితురాలిపై పెట్రోల్‌ పోసి నిప్పటించిన ఘటనపై విచారణకు ఐదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)ను ఏర్పాటుచేస్తున్నట్టు లక్నో డివిజనల్‌ కమిషనర్‌ ప్రకటించారు. 'ఉన్నావోలో ఘటన జరిగిన ప్రదేశానికి వెళ్ళి పరిశీలించాను. ఉన్నావో ఏఎస్‌పీ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన సిట్‌ను ఏర్పాటుచేస్తున్నాను. కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు నిర్వహించి.. నివేదికను సమర్పిస్తుంది. నివేదిక వచ్చిన తర్వాత.. దానిని ప్రభుత్వానికి సమర్పిస్తాం' అని డివిజనల్‌ కమిషనర్‌ ముఖేష్‌ మేశ్రాం చెప్పారు. దర్యాప్తునకు కాలపరిమితి విషయంపై ఆయన మాట్లాడకపోవటం విమర్శలకు దారితీస్తోంది. మ‌రోవైపు, నిందితుల్లో ఒకడు ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: