ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 1,26,728 గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించి ప్రభుత్వం ఇప్పటికే గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేసింది. అక్టోబర్ 2వ తేదీన గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన ఉద్యోగులు విధుల్లో చేరారు. రాష్ట్రంలో వచ్చే నెల 1వ తేదీ నుండి సచివాలయ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. 
 
1,26,728 గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగాల్లో 1,20,000 మందిని అధికారులు ఎంపిక చేయగా 1,10,000 మంది సమ్మతి తెలిపారు. వీరిలో 75,000 మంది రాష్ట్రంలో శిక్షణ పొందుతున్నారు. గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగాలలో కొందరు వ్యక్తిగత కారణాలతో విధుల్లో చేరలేదు. రెండు, మూడు ఉద్యోగాలకు ఒకే వ్యక్తి ఎంపిక కావటం వలన ఉద్యోగాలు పూర్తిగా భర్తీ కాలేదు. 
 
కొన్ని ఉద్యోగాలకు తగినన్ని ధరఖాస్తులు రాకపోవడం, ధరఖాస్తులు వచ్చినా అభ్యర్థులు అర్హత మార్కులు సాధించలేకపోవటం వలన పూర్తి స్థాయిలో ఉద్యోగాల భర్తీ జరగలేదు. ప్రభుత్వం తాజాగా స్పోర్ట్స్ కోటా కింద ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నెలాఖరులోగా నియామకాలు పూర్తి అయిన తరువాత అధికారులు మిగిలిన పోస్టుల నోటిఫికేషన్ కోసం ప్రతిపాదనలు పంపనున్నారు. ప్రభుత్వం జనవరి నెలలో మిగిలిన పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. 
 
ప్రస్తుతం అధికారులు స్పోర్ట్స్ కోటా కింద ఉన్న 2,300 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కలెక్టర్లు జిల్లా కమిటీలకు ఈ ఉద్యోగాల భర్తీ కోసం ఆదేశాలను ఇవ్వనున్నారు. ఏ.ఎన్.ఎం ఉద్యోగాలను అధికారులు హైకోర్టు తాజా ఆదేశాలను అనుసరించి భర్తీ చేయబోతున్నారు. పశు సంవర్థక శాఖ సహాయకుల్లో మిగిలిన పోస్టుల భర్తీకి తీసుకునే చర్యలపై కూడా అధికారులు దృష్టి సారించారు. 15,000 ఉద్యోగాలకు పైగా మిగిలే అవకాశం ఉందని త్వరలో స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: