దిశ హత్యోదంతంలో నిందుతులైన నలుగురు తప్పించుకునే ప్రయత్నంలో పోలీస్ ఎన్ కౌంటర్ కు గురైన సంగతి తెలిసిందే. అయితే.. వారి మృతదేహాల కోసం వేచి చూస్తున్న వారి కుటుంబసభ్యులకు ఆ అవకాశం దక్కలేదు.. వారం రోజుల క్రితం పోలీసులు తమ బిడ్డలను తీసుకెళ్లారని కనీసం వారితో ఫోన్‌లో కూడా మాట్లాడలేకపోయామని రోదిస్తున్నారు. చనిపోయిన వారిని చివరి చూపుకైనా నోచుకుంటామనుకున్న వారికి శుక్రవారం ఉదయం 7గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ ఎదురుచూపులే దిక్కయ్యాయి.

 

 

కానీ వారి మృతదేహాలు రావట్లేదని సమాచారం అందడంతో కన్నీటిపర్యంతమయ్యారు. తమ బిడ్డలను నిర్దాక్షిణ్యంగా ఎన్‌కౌంటర్‌ చేశారంటూ మృతుల కుటుంబసభ్యులు శనివారం ఉదయం కూడా గుడిగండ్ల ప్రధాన రహదారిపై బైఠాయించారు. పోలీసుల దౌర్జన్యం నశించాలంటూ ధర్నాకు దిగారు. గ్రామస్తులు కూడా వారికి నిరసనకు మద్దతు తెలిపారు. ధర్నా చేసినవారిలో చెన్నకేశవులు భార్య రేణుక, తల్లి జయమ్మతో పాటు శివ కుటుంబీకులు, బంధువులు రాస్తారోకో చేపట్టారు. అక్కడికి వచ్చిన పోలీసులతో.. ‘ఇలా ఎన్‌కౌంటర్‌ చేసి నా భర్తను చంపడం మీకు న్యాయామా? నా భర్త శవాన్ని నాకు అప్పగించండి. ఆయన మృతదేహాన్ని మీరే తీసుకెళ్లి ఎలా పూడ్చేస్తారు’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో ఒక్కసారిగా గ్రామంలో ఉద్రిక్తత వాతావారణం నెలకొంది. పోలీసు అధికారులు కలుగజేసుకొని మీ శవాలను మీకు అప్పగిస్తాం.. మీ సంప్రదాయం ప్రకారమే అంత్యక్రియలు జరిపేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు భరోసానివ్వడంతో బాధితులు శాంతించి ఇంటికి వెళ్లిపోయారు. 

 

 

నిందితుల్లో ఆరీప్, నవీన్, చెన్నకేశులు వారి కుటుంబాల్లో ఒక్కరే కుమారులు. ఆ కుటుంబాల జీవన పరిస్థితి ఏంటని.. ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తప్పు చేసిన నిరుపేద కుటుంబాల వారిని ఎన్‌కౌంటర్‌ చేసినట్టే పెద్ద వాళ్ల పిల్లలు తప్పు చేసినా ఇలాగే ఎన్‌కౌంటర్‌ చేయాలని వారంతా డిమాండ్‌ చేశారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: