ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ కొత్త కార్యాలయం ప్రారంభం అయ్యింది. మంగళగిరిలో నిర్మించిన ఆఫీస్‌ను పార్టీ అధినేత చంద్రబాబు ప్రారంభించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇకపై ఇక్కడి నుంచే కార్యక్రమాలు నిర్వహించనుంది టీడీపీ.   

 

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. రెండేళ్లుగా సరైన ఆఫీసు లేక ఇబ్బంది పడుతున్న తెలుగు తమ్ముళ్లకు ఆంధ్రప్రదేశ్ తెలుగు దేశం పార్టీ కొత్త కార్యాలయం అందుబాటులోకి వచ్చింది. మంగళగిరి మండలం ఆత్మకూరులో నిర్మించిన కొత్త ఆఫీస్‌ను పార్టీ అధినేత చంద్రబాబు ప్రారంభించారు. సతీమణితో సహా పార్టీ కార్యాలాయానికి వచ్చిన చంద్రబాబు, అక్కడ నిర్వహించిన హోమంలో పాల్గొన్నారు. అనంతరం పార్టీ నేతలు, కుటుంబ సభ్యులు సమక్షంలో కార్యాలయాన్ని ప్రారంభించారు. ఎన్టీఆర్ విగ్రహంతో పాటు, పార్టీ జండాను ఆవిష్కరించారు టీడీపీ అధినేత చంద్రబాబు.  

 

టీడీపీ కార్యాలయ భవనం నిర్మాణం రెండేళ్లుగా సాగుతోంది. మూడున్నర ఎకరాల స్థలంలో జీ ప్లస్ త్రీ పద్ధతిలో మూడు బ్లాకులుగా అన్ని హంగులతో దీనిని నిర్మిస్తున్నారు. మొదటి బ్లాక్‌ సిద్ధం కావడంతో ప్రారంభించారు. ఈ భవనంలోని మూడవ ఫ్లోర్‌లో చంద్రబాబు, లోకేష్‌ల ఛాంబర్లు ఉన్నాయి. గుంటూరు కార్యాలయం నుంచి ఇప్పటి వరకు కార్యకలాపాలు జరిపిన టీడీపీ... ఇకపై మంగళగిరిలోని కొత్త కార్యాలయం నుంచి పని చేయనుంది. 

 

కొత్త టీడీపీ కార్యాలయం ప్రారంభం కావడంతో టీడీపీ శ్రేణుల్లో ఒకింత ఉత్సాహం నెలకొంది. ఎప్పుడూ తమ అధినేత అందుబాటులో ఉంటారనీ.. ఏవైనా సమస్యలుంటే ఆయన దృష్టికి తీసుకెళ్లొచ్చని యోచిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు టీడీపీ కార్యాలయం అనువుగా ఉండనుంది. కొత్త రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఆ పార్టీకి.. పార్టీ కార్యాలయం లేదు. అంతకుముందు ప్రజావేదికలోనే మీటింగ్ లు పెట్టుకునే వారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక దాన్ని కూల్చేయడంతో సమీక్షలు జరుపుకునేందుకు టీడీపీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఇపుడు పార్టీ ఆఫీస్ అందుబాటులోకి రావడంతో పార్టీ శ్రేణులు నూతనోత్సాహంతో ఉన్నాయి. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: