గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యుడు నంబూరు శంకరరావు ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లి లక్ష్మీకాంతమ‍్మ అనారోగ్యంతో మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న లక్ష్మీకాంతమ‍్మ శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. దీంతో వారింట విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన ఇంటికి చేరుకుని ఎమ్మెల్యేను పరామర్శించారు. 

 

 

విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌లో ఎమ్మెల్యే శంకరరావును పరామర్శించారు. పలువురు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఎమ్మెల్యేలు, ఎంపీలు, కీలకనేతలు శంకరరావును పరామర్శించి, సంతాపం తెలిపారు. కాగా.. 2018 లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన శంకర్ రావు తొలి ప్రయత్నంలోనే పెదకూరపాడు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. జగన్ కు నమ్మకస్తుడిగా ఆయన పార్టీకి సేవలందించారు. ఆయన కష్టాన్ని గుర్తించిన సీఎం ఎన్నికల్లో పోటీకి అవకాశం కల్పించారు. జగన్ ఆయన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎన్నికల్లో కష్టపడ్డారు. రాష్ట్ర రాజ‌ధానికి గుంటూరు జిల్లాలోని కీల‌క‌ అసెంబ్లీ నియోజకవర్గం అయిన పెద‌కూర‌పాడు నియోజ‌క‌వ‌ర్గం నుంచి గత రెండు ఎన్నికల్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీడీపీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ హ్యాట్రిక్ విజయాన్ని అడ్డుకున్నారు. ఆ సీటును ఆశించిన వైసీపీ కీలకనేత కావటి శివనాగమనోహర్ నాయుడును కాదని శంకర రావుకు టికెట్ కేటాయించారు సీఎం జగన్. ఆయన 2019 సాధారణ ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించారు.

 

 

గుంటూరు జిల్లాకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగన్ కీలకంగా వ్యవహరించారు. పార్టీ నుంచి శంకర రావుకు ఫుల్ సపోర్ట్ అందించారు. తెలుగుదేశంకు పట్టున్న ప్రాంతం కావడంతో వైసీపీ నాయకులు కష్టించి పనిచేశారు. దీంతో తొలిసారి అక్కడ వైసీపీ జెండా ఎగిరింది. ఈ నేపథ్యంలో శంకర రావుపై జగన్ కు ప్రత్యేక అభిమానం ఏర్పడింది. రాజకీయంగా పెదకూరపాడు నియోజకవర్గాన్ని శివ నగమనోహర్ నాయుడు ఆశించారు. కానీ జగన్ శంకర రావు పైనే నమ్మకముంచారు. దీంతో శంకర రావు గెలుపుకు అందరూ సహకరించి గెలిపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: