గత కొన్ని రోజులగా సామాన్యులకు కన్నీళ్లు తెపిస్తున్న ఉల్లి ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కిలో రూ.150 వరకూ వెళ్లిన ఉల్లి ధరలు వంద రూపాయల కిందకి వచ్చాయి . నిన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన మార్కెట్‌ అయిన కర్నూలులో క్వింటా ఉల్లి ధర రూ.12,500 నుంచి రూ.15,000 వరకూ పలికింది. కానీ ఇప్పుడు కర్నూలు మార్కెట్‌లో క్వింటా ఉల్లి ధర ప్రస్తుతం రూ.8,600కు దిగివచ్చింది.

 

జగన్ సర్కార్ రాష్ట్ర అవసరాలు తీరకుండా ఉల్లిని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి కాకుండా చూసారు. రాష్ట్రంలో కొన్ని చోట్ల ఉల్లి లారీలను సైతం సీజ్ చేసినట్లు సమాచారం. ప్రభుత్వ చర్యలతో ఏపీలో ఉల్లి ధరలు మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే తగ్గుముఖం పట్టాయి. దేశవ్యాప్తంగా హైదరాబాద్, చెన్నైలో రూ.150కి పైగా ధర పలుకుతోంది. మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలతో ఉల్లి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. సాధారణ స్థాయి కంటే ఉల్లి దిగుబడులు తగ్గిపోవడంతో ఒక్కసారిగా గిరాకీ పెరిగిపోయింది.

 


ఉల్లి ధరలు కన్నీళ్లు పెట్టిస్తున్న నేపథ్యంలో  కేంద్రం ప్రభుత్వం ఇప్పటికే ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించింది. అయినప్పటికీ ధరలు మాత్రం అదుపులోకి రాలేదు. దీనితో ఉల్లి దిగుమతి చేయాలి అని నిర్ణయం తీసుకున్నారు.

 

రాష్ట్రంలో  స్థానిక అవసరాలు తీరకుండా ఎగుమతులు చేయడానికి వీల్లేదని జగన్  ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. దీనితో రంగంలోకి వచ్చిన మార్కెటింగ్ శాఖ అధికారులు ఉల్లి ఇతర రాష్ట్రాలకు తరలిపోకుండా చర్యలు తీసుకున్నారు. ఉల్లి ఎగుమతులను నిలిపివేశారు. దీంతో కర్నూలు మార్కెట్‌లో ఉల్లి ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. ఇన్ని రోజులు తమ పంట వల్ల చేసిన అప్పు మొత్తం తీర్చుకోవచ్చు అని ఆశలు పెంచుకున్న రైతులకి మళ్ళీ నిరాశే మిగిలే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ధరలు తగ్గుతుండడంతో  రైతులు కూడా తమ సరుకును వీలయినత త్వరగా అమ్ముకోవాలి అని చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: