తెలంగాణ సీఎం కేసీఆర్ మ‌రోమారు కేంద్ర ప్ర‌భుత్వంపై భ‌గ్గుమ‌న్నారు. ఇటీవ‌ల కేంద్రంపై కేసీఆర్ త‌న‌యుడు కేటీఆర్ వివ‌క్ష కామెంట్లు చేసి రోజుల వ్య‌వ‌ధిలోనే... గులాబీ ద‌ళ‌ప‌తి సైతం ఒంటి కాలుపై లేశారు. కేంద్ర మంత్రుల మాటలకు, వాస్తవాలకు అస్సలు పొంతన లేదని ఆయ‌న విరుచుకుప‌డ్డారు. ఇప్పటివరకు కేంద్రం నుంచి రాష్ట్ర పన్నుల వాటా తక్కువగా వచ్చిందని సీఎం తెలిపారు. రెవెన్యూ, ఆర్థిక అంశాలపై ముఖ్యమంత్రి ప్రగతిభవన్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై సీఎం సమీక్షలో ప్రస్తావించారు. ప‌న్నుల వాటా ప్రకారం నిధులు ఇవ్వాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ కు సీఎం కేసీఆర్‌ లేఖ రాశారు. 

 

రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర పన్నుల వాటా రూ. 924 కోట్ల రూపాయలు తగ్గిందని సీఎం కేసీఆర్‌ సమావేశంలో అన్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతుందని సీఎం తెలిపారు. పన్నుల వాటా గణనీయంగా తగ్గినందున అన్ని శాఖలకు నిధులు తగ్గించాలని నిర్ణయించినట్లు సీఎం తెలిపారు. ఖర్చులపై అన్ని శాఖల్లోనూ స్వీయ నియంత్రణ పాటించాలని సీఎం సూచించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై నివేదిక రూపొందించాలని ఆర్థిక శాఖ అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. సమగ్ర వివరాలతో నివేదికను ఈ నెల 11న జరిగే మంత్రివర్గ భేటీలో ఇవ్వాలని ఆదేశించారు.

 

ఇదిలాఉండ‌గా. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధుల గురించి సీఎం కేసీఆర్‌ త్వరలో ప్రధాని మోదీని కలిసే యోచనలో ఉన్నట్లు సమాచారం. గ‌త‌వారం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లిన‌ప్ప‌టికీ...ఓ ప్రైవేటు వివాహ కార్య‌క్ర‌మంలో పాల్గొని తిరిగి తెలంగాణ‌కు వ‌చ్చారు. ఈ టూర్‌లోనే ఆయ‌న ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీతో స‌మావేశం అవుతార‌ని ప్ర‌చారం జ‌రిగిన‌ప్ప‌టికీ...అది ఆచ‌ర‌ణ రూపం దాల్చ‌లేదు. తాజాగా త‌న డిమాండ్ల‌ను పేర్కొంటూ ఆయ‌న ప్ర‌ధానిని క‌లువనుండ‌టం చ‌ర్చనీయాంశంగా మారింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: