జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్‌హెచ్‌ఆర్సీ) బృందం తెలంగాణ రాష్ట్ర ప‌ర్య‌ట‌న ఆస‌క్తిక‌రంగా సాగింది. దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన  `దిశ` హ‌త్యోదంతం, నిందితుల ఎన్‌కౌంట‌ర్ నేప‌థ్యంలో క‌మిష‌న్ రాష్ట్ర ప‌ర్య‌ట‌న ఆస‌క్తిని రేకెత్తించింది. ఈ రోజు మ‌ధ్యాహ్నం రాష్ట్రానికి వ‌చ్చిన క‌మిష‌న్  మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో నాలుగు మృతదేహాలను చూసింది. సుమారు మూడు గంటలకు పైగా ఆస్పత్రిలోనే ఉన్న ఎన్‌హెచ్‌ఆర్సీ సభ్యులు అనంతరం న‌లుగురు మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. దిశ అత్యాచారం, హ‌త్య గురించి ఎన్‌కౌంట‌ర్ గురించి వారి అభిప్రాయాలు, అభ్యంత‌రాలు అడిగి తెలుసుకున్నారు. 

దిశ హత్యాచార కేసులో నలుగురు నిందితులను చటాన్‌పల్లి బ్రిడ్జి వద్ద పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేసిన విషయం తెలిసిందే. దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపిన ఈ ఘ‌ట‌న‌లో జాతీయ మానవ హక్కుల కమిషన్ కూలంక‌షంగా అధ్య‌య‌నం చేశారు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్ స్పాట్‌ను పరిశీలించి ఎన్‌హెచ్‌ఆర్సీ విచారణ చేసింది. 'దిశ' మృతదేహాన్ని నిందితులు దహనం చేసిన ప్రాంతాన్ని కూడా ఎన్‌హెచ్‌ఆర్సీ కమిటీ పరిశీలించింది. చటాన్‌పల్లిలో దిశ ఘటన, నిందితుల ఎన్‌కౌంటర్ ఘటనా స్థలాన్ని స్వ‌యంగా పరిశీలించిన క‌మిటీ నివేదిక‌కు సంబంధించిన స‌మాచారాన్ని సేక‌రించింది. ఇప్ప‌టికే ఎన్‌కౌంట‌ర్ విష‌యంలో తెలంగాణ పోలీసుల‌కు జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఎన్‌కౌంట‌ర్ ఎలా జ‌రిగిందో వివ‌ర‌ణ ఇవ్వాల‌ని కోరింది. తాజాగా క్షేత్ర‌స్థాయిలో ప్ర‌త్య‌క్షంగా ద‌ర్యాప్తు చేయ‌డం ద్వారా ఎన్‌హెచ్ఆర్‌సీ ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోనుంద‌నే ఆస‌క్తి స‌ర్వ‌త్రా నెల‌కొంది.  

 


కాగా, షాద్‌నగర్‌ చటాన్‌పల్లి వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టులో ఇవాళ పిటిషన్‌ దాఖలైంది. పోలీసులపై ఎఫ్‌ఐఆర్‌, దర్యాప్తు, చర్యలు తీసుకోవాలని కోరుతూ పిటిషన్‌ దాఖలైంది. సుప్రీంకోర్టు 2014 మార్గదర్శకాలను పాటించలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను న్యాయవాదులు జీఎస్‌ మణి, ప్రదీప్‌ కుమార్‌ యాదవ్‌ దాఖలు చేశారు. దీంతో సుప్రీంకోర్టు తీర్పుపై ఆస‌క్తి నెల‌కొంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: