ప్రాంతంతో సంబంధం లేకుండా, వ‌య‌సు  గురించి క‌నీస ఆలోచ‌న లేకుండా ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా ఆకృత్యాలు చోటు చేసుకుంటున్నాయి. ఆడ‌బిడ్డ‌ల‌ను చెర‌ప‌డుతున్నారు. దిశ హ‌త్య ఉదంతం, అనంత‌రం హంతకుల ఎన్‌కౌంటర్‌ ఘటన పట్ల దేశవ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  అయితే, అదే స‌మ‌యంలో ప‌లు సంచ‌ల‌న నిజాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. జాతీయ నేర రికార్డ్స్‌ బ్యూరో (ఎన్సీఆర్బీ) తాజా నివేదిక ప్రకారం లైంగిక దాడి కేసుల్లో చాలా తక్కువ మందికే శిక్షలు పడుతున్నాయి. సుమారు 70 శాతం లైంగిక దాడి కేసులు కోర్టుల వరకు వెల్లడం లేదు. కేసుల దర్యాప్తు, విచారణ ఏళ్ల పాటు సాగడంపట్ల బాధితులు విసిగిపోతున్నారు. అందుకే సత్వర న్యాయం కోసం నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయాలని బాధిత కుటుంబాలతోపాటు ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

 


జాతీయ నేర రికార్డ్స్‌ బ్యూరో (ఎన్సీఆర్బీ) విడుద‌ల చేసిన 2017 గణాంకాల ప్రకారం లైంగిక దాడి కేసుల్లో 1,46,201 లైంగిక దాడి కేసులపై కోర్టులు విచారణ జరుపగా 5,822 మందిని మాత్రమే దోషులుగా నిర్ధారించారు.  అంటే దోషులుగా తేలినవారు కేవలం 32.2 శాతం మాత్రమే. మరోవైపు చార్జిషీటు నమోదు రేటు గణనీయంగా తగ్గుతున్నది. 2013లో 95.4 శాతం ఉండగా 2017లో 86.6 శాతం నమోదైంది. సుమారు 70 శాతం లైంగిక దాడి కేసులు కోర్టుల వరకు వెల్లడం లేదని దీని ద్వారా తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో పోలీస్‌, న్యాయ వ్యవస్థల్లో మార్పులు అవరసమని వారు అభిప్రాయపడుతున్నారు.

 

కాగా, ‘దిశ’ నిందితుల ఎన్‌కౌంటర్‌పై ‘నిర్భయ’ తల్లి ఆశాదేవి స్పంద‌న ఇందుకు ఉదాహ‌ర‌ణ‌గా పేర్కొన‌వ‌చ్చు. కనీసం ఒక్క తల్లికైనా సత్వర న్యాయం దక్కిందంటూ హర్షం వ్యక్తం చేశారు. తాము న్యాయం కోసం ఏడేళ్లుగా పోరాడుతూనే ఉన్నామని గుర్తుచేశారు. ‘ఈ ఘటనతో తమ బిడ్డకు న్యాయం జరిగిందని దిశ తల్లిదండ్రులు భావిస్తుండొచ్చు. అదేసమయంలో ఇలాంటి నేరాలు చేయాలనుకునేవారిలో ఒకరకమైన భయం పుట్టింది’ అని పేర్కొన్నారు. హైదరాబాద్‌ పోలీసులు ఎలా ఆదర్శంగా నిలిచారో ఢిల్లీ పోలీసులు, ప్రభుత్వం, కోర్టు గమనించాలని సూచించారు. నిర్భయ హంతకులకు కూడా త్వరగా ఉరిశిక్షను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని, న్యాయవ్యవస్థను డిమాండ్‌ చేశారు. ‘దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఉన్నతాధికారులను కోరుతున్నా. అప్పుడప్పుడు ఇలా నిబంధనలను ఉల్లంఘించి నేరస్థులను కఠినంగా శిక్షిస్తేనే సమాజంలో మంచి మార్పును చూడగలం’ అని ఆశాదేవి పేర్కొన్నారు. నిర్భయ తండ్రి మాట్లాడుతూ.. ‘దిశ కుటుంబం బాధను మేము అర్థం చేసుకోగలం. కనీసం వారికైనా సత్వర న్యాయం దక్కింది. మాలాగా న్యాయం కోసం ఏడేళ్ల‌డ్లపాటు పోరాడాల్సిన అవసరం తప్పింది’ అని వ్యాఖ్యానించారు. చట్టంలోని లోపాలను ఆసరాగా చేసుకొని రేపిస్టులు తప్పించుకుంటున్నారని, ఇలాంటి ఎన్‌కౌంటర్లు వారికి సమాధానం ఇస్తాయని నిర్భ‌య తాత వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: