డిజిటల్ ఇండియా వైపు అడుగులు వేస్తున్న భారత్ ఆ దిశగా ఒక్కో అడుగు వేస్తూ ముందుకు వెళ్తోంది, వీలైనంత తొందరగా భారత్ లో నగదు రహిత లావాదేవీలు అమల్లోకి తేవాలని తద్వారా బ్లాక్ మనీని అరికట్టాలని మోడీ సర్కార్ యోచిస్తోంది. నల్ల ధనం భారీ ఎత్తున బయటకు వస్తుందనే ఉదేశ్యంతో నవంబర్ 8, 2016న పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. కానీ మోడీ ఆశించిన రీతిలో మాత్రం నల్ల ధనం బయటకు రాలేదు. నోట్ల రద్దు ద్వారా దేశంలో భారీగా నల్ల ధనం పేరుకుపోయిందని అర్ధం అయింది.

 

తాజాగా రూ 2000 నోట్ల రద్దుపై మరోసారి జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. జాతీయ మీడియా కథనం ప్రకారం రూ 2000 నోట్లను రద్దు చేస్తారనే నేపథ్యంలో, కొన్ని కంపెనీలు వినియోగదారుల నుండి రూ 2000 నోట్లను తీసుకోవద్దని తమ క్యాషియర్లకు సూచించాయి. ఇక కొన్ని కంపెనీలు, రూ 2000 నోట్ల నగదు బ్యాలెన్స్‌ను బ్యాంకుల్లో జమ చేయాలని వారు తమ అకౌంటెంట్లను ఆదేశించారు. 

 

రూ 2000 నోటు రద్దు తద్యమంటూ కర్ణాటక కేంద్రంగా నెలకొల్పిన లాజిస్టిక్స్ సంస్థ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది, కాని ఈ వార్త ప్రామాణికతను వెంటనే నిర్ధారించలేము. సంస్థను టెలిఫోన్ ద్వారా సంప్రదించడానికి పలు ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. 'రూ.2,000 నోట్ల సర్క్యులేషన్ తగ్గింది. వీటిని బయటకు రాకుండా నిల్వ చేస్తున్నారు’ అని గత నెలలో ఆర్ధిక శాఖ మాజీ కార్యదర్శి గార్గ్ తెలిపారు. తక్కువగా సర్క్యూలేషన్లో ఉన్న రూ 2000 నోటు రద్దు చేయొచ్చు అంటూ గార్గ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

ఒక ఉన్నత స్థాయి అధికారి అంచనా ప్రకారం, రూ 2,000 నోట్లు విలువ పరంగా చెలామణిలో ఉన్న కరెన్సీ నోట్లలో మూడింట ఒక వంతు ఉన్నాయి. రూ 2000 నోట్ల చలామణి ఆపే ఆలోచనలేవీ లేవని ప్రభుత్వం ఈ మధ్యే రాజ్యసభలో ఓ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన నేపథ్యంలో జాతీయ మీడియాలో పెద్ద నోటు రద్దుపై వచ్చిన కథనాలు మరోసారి నోట్ల రద్దుపై చర్చకు దారితీస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: