ఒక గదిలో అమ్మాయి.. అబ్బాయి దొరికిపోతే.. ఇది నేరం అవుతుందా.. ఆ గదిలో మద్యం సీసాలు ఉంటే అది నేరమవుతుందా.. ఇదే వాజ్యం మద్రాసు హైకోర్టు ముందుకు వచ్చింది. ఈ కేసును అన్ని విధాలా విచారించిన కోర్టు.. అది పెద్ద తప్పేంకాదని తేల్చి చెప్పింది. అవివాహిత జంట ఒకే గదిలో ఉండటం నేరమని చట్టం చెప్పలేదని మద్రాసు హైకోర్టు కామెంట్ చేసింది.

 

ఇంతకీ అసలేం జరిగిందంటే.. కోయంబత్తూరులోని ఓ ప్రైవేటు లాడ్జికి ఇటీవల జిల్లా అధికారులు సీలు వేశారు. ఓ గదిలో అవివాహిత జంట, మరో గదిలో మద్యం సీసాలు ఉన్నాయనే కారణాలను పోలీసు, రెవెన్యూ అధికారులు చూపించారు. దీన్ని సవాల్‌ చేస్తూ లాడ్జి యాజమాన్యం మద్రాసు హైకోర్టులో దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ న్యాయమూర్తి ఎం.ఎస్‌.రమేశ్‌ ముందుకు విచారణకు వచ్చింది.

 

న్యాయమూర్తి ఇరు పక్షాల వాదనలు కూలంకషంగా విన్నారు. పోలీసులు చెప్పే వివరణతో ఏకీభవించలేమని తేల్చి చెప్పారు. పెళ్లికాని స్త్రీ, పురుషులు ఒకే గదిలో ఉండకూడదనే ది చట్టం లో ఎక్కడా లేదని న్యాయమూర్తి కామెంట్ చేశారు. కాబట్టి అది ఎలా తప్పవుతుందని న్యాయమూర్తి అడిగారు. అలాంటి నిబంధనలు, చట్టాలు ఉంటే చూపించాలని చెప్పారు. ఇదే సమయంలో న్యాయమూర్తి మరో విషయం ప్రస్తావించారు.

 

సహ జీవనాన్ని నేరంగా ఎలా పరిగణించలేమో, అలాగే లాడ్జిలోని ఒకే గదిలో అవివాహిత జంట ఉండటాన్ని నేరంగా చూడలేమని న్యాయమూర్తి స్పష్టం చేశారు. కాబట్టి ఇక పెళ్లి కాని జంటలు లాడ్జిల్లో ఉన్నంత మాత్రాన వారిని తప్పు చేసినట్టుగా పోలీసులు భావించి కేసులు పెట్టే అవకాశం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: