తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్య కేసు నిందితులను పోలీసులు ఆత్మరక్షణ కోసం రెండు రోజుల క్రితం ఎన్ కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా దిశ కేసు నిందితులను ఎన్ కౌంటర్ చేయటంపై హర్షం వ్యక్తం అవుతోంది. నిందితుల కుటుంబ సభ్యులు మాత్రం పోలీసులు నిందితులను అన్యాయంగా ఎన్ కౌంటర్ చేశారని రోదిస్తున్నారు. 
 
దిశ హత్య కేసులో ప్రధాన నిందితుడైన అరీఫ్ తల్లి మౌలాన్ బీ మీడియాతో మాట్లాడుతూ పోలీసులు నా కొడుకును తీసుకెళ్లిన తరువాత ఇప్పటివరకూ వాడి ముఖం చూడలేదని అన్నారు. చివరి చూపుకు కూడా నోచుకోకుండానే తన కొడుకును ఎన్ కౌంటర్ చేశారని అన్నారు. ఇక వాడి శవం తీసుకొని ఏం చేస్తామని అన్నారు. అరీఫ్ శవంతో మాకు పనిలేదని మౌలాన్ బీ చెప్పారు. అంత్యక్రియలు చేసే ఆర్థిక పరిస్థితి కూడా తమకు లేదని అంత్యక్రియలు కూడా చేయలేమని చెప్పారు. 
 
నిందితులలో ఒకరైన చెన్నకేశవులు భార్య రేణుక మీడియాతో మాట్లాడుతూ తన భర్తను పోలీసులు హతమార్చి ఎన్ కౌంటర్ అని అంటున్నారని చెప్పారు. పెళ్లై సంవత్సరం కూడా కాలేదని నేను మాత్రం ఇక బతకనని రేణుక చెప్పారు. ఈ భూమి మీద ఇంకెక్కడ హత్యలు జరగలేదా... వాళ్లను కూడా ఇలాగే శిక్షించారా...? అని రేణుక ప్రశ్నించారు. తన భర్తను ఎక్కడ చంపారో తనను కూడా అక్కడే చంపాలని అన్నారు. 
 
9 నెలల పిల్లను చేసినోన్ని విడిచిపెట్టలేదా..? వాళ్లను జైలులో పందుల్లా మేపుతున్నారని చెప్పారు. మరో నిందితుడు శివ సోదరి మాట్లాడుతూ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి ఉంటే చివరి చూపు అయినా చూసేవారని ఉదయం 7 గంటల సమయంలో నా తమ్ముడిని ఎన్ కౌంటర్ చేసిన సంఘటన టీవీలో చూసి దిగ్భ్రాంతికి గురయ్యానని చెప్పారు. మరో నిందితుడు నవీన్ తండ్రి ఎల్లప్ప మీడియాతో మాట్లాడుతూ పోలీసులు తన కొడుకుతో కనీసం మాట్లాడటానికి కూడా అనుమతి ఇవ్వలేదని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: