మద్రాస్ హైకోర్టు వివాహం కాని జంట ఒకే గదిలో ఉండటం నేరమని చట్టం ఎక్కడా చెప్పలేదని వ్యాఖ్యలు చేసింది. కొన్ని రోజుల క్రితం కోయంబత్తూరులోని ఒక ప్రైవేటు లాడ్జీకి కోయంబత్తూరు జిల్లా అధికారులు సీలు వేశారు. పోలీసు, రెవెన్యూ అధికారులు ఒక గదిలో వివాహం కాని జంట, మరో గదిలో మద్యం సీసాలు ఉండటంతో లాడ్జీకి సీలు వేసినట్లు లాడ్జీ యాజమాన్యానికి తెలిపారు. 
 
లాడ్జీ యజమాని పోలీసు, రెవెన్యూ అధికారులు లాడ్జీకి సీలు వేయటాన్ని సవాల్ చేస్తూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ న్యాయమూర్తి రమేశ్ సమక్షంలో విచారణకు వచ్చింది. న్యాయమూర్తి పోలీసులు లాడ్జీకి సీలు వేయటానికి చెప్పిన వివరణతో ఏకీభవించలేమని అన్నారు. వివాహం కాని స్త్రీ, పురుషుడు ఒకే గదిలో ఉండకూడదని చట్టం లేదని కోర్టు వ్యాఖ్యలు చేసింది. 
 
చట్టం లేని నేపథ్యంలో వివాహం కాని స్త్రీ, పురుషుడు ఒకే గదిలో ఉండటం తప్పు ఎలా అవుతుందని కోర్టు ప్రశ్నించింది. న్యాయమూర్తి రమేశ్ లివింగ్ టుగెదర్ విధానంలో సహజీవనాన్ని నేరంగా ఏ విధంగా పరిగణించలేమో అదే విధంగా ఒకే గదిలో వివాహం కాని జంట ఉండటాన్ని నేరంగా చూడలేమని  స్పష్టం చేశారు. మద్యం సీసాలు ఒక గదిలో ఉన్నంత మాత్రాన ఆ లాడ్జీలో బార్ నిర్వహిస్తున్నారని చెప్పలేమని న్యాయమూర్తి పేర్కొన్నారు. 
 
తమిళనాడు మద్యపాన చట్టం ప్రకారం ఒక వ్యక్తి 9 లీటర్ల వైన్, ఏడు లీటర్ల బీరు, విదేశీ మద్యం లీటరు ఉండటానికి అనుమతి ఉందని అన్నారు. చట్టప్రకారం లాడ్జి మూసివేతలో నియమ నిబంధనలు పాటించలేదని న్యాయమూర్తి వ్యాఖ్యలు చేశారు. కోయంబత్తూర్ కలెక్టర్ కు న్యాయమూర్తి లాడ్జీ మూసివేతలో చట్టప్రకారం నియమనిబంధనలను పాటించలేదని అందువలన లాడ్జీకి వేసిన సీలును తొలగించాలని వ్యాఖ్యలు చేశారు. చట్ట ప్రకారం హోటల్స్ లో రూమ్ బుక్ చేసుకోవాలంటే పెళ్లి కాని జంటకు 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు దాటి ఉండాలి. ఖచ్చితంగా 18 ఏళ్లు దాటి ఐడీ కార్డ్స్ వారి దగ్గర ఉంటే హోటల్స్ లో రూమ్ బుక్ చేసుకోవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: